మారుతీ మ్యాన్‌ జగదీశ్‌ ఖట్టర్‌ కన్నుమూత! - Maruti man jagadish Khattar is no more
close

Published : 26/04/2021 21:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతీ మ్యాన్‌ జగదీశ్‌ ఖట్టర్‌ కన్నుమూత!

ముంబయి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మాజీ ఎండీ జగదీశ్‌ ఖట్టర్‌(79) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఐఏఎస్‌ అధికారి అయిన ఖట్టర్‌ భారత వాహన పరిశ్రమపై తిరుగులేని ముద్ర వేశారు. 2002లో ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకొని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌తో ఉన్న సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకొచ్చిన తర్వాత మారుతీ వృద్ధికి ఖట్టర్‌ ఎంతో కృషి చేశారు. ఖట్టర్‌ మృతి పట్ల యావత్తు వాహన పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  

1993లో మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌లో మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్‌గా చేరిన ఖట్టర్‌.. ఆరేళ్లలోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వం మధ్య 1999లో తీవ్ర విభేదాలు నెలకొన్న సమయంలో ఖట్టర్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇరు పక్షాల మధ్య ఒప్పందంతో ఆయనను మూడేళ్ల పాటు మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ ఎండీగా నియమించారు. ప్రభుత్వం, సుజుకీ మధ్య విభేదాలతో పాటు.. 2000లో సంస్థలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె వంటి సమస్యలను ఖట్టర్‌ సమర్థంగా పరిష్కరించారు.

2002లో ఎండీని నియమించాల్సిన వంతు సుజుకీకి వచ్చినప్పుడు కూడా ఖట్టర్‌నే ఎన్నుకోవడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. అలా 2007 పదవీ విరమణ పొందే వరకు ఆయన సంస్థకు ఎండీగా సేవలందించారు. ఈ సమయంలో ఐరోపా నుంచి అనేక కార్ల తయారీ దిగ్గజాలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశీయ కంపెనీలకు భద్రత, అధునాతన ఫీచర్ల విషయంలో సవాల్‌ విసిరాయి. కానీ, వాటన్నింటినీ తోసిరాజని సరికొత్త మోడళ్లను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టి విదేశీ కంపెనీ పోటీని దీటుగా ఎదుర్కొనడంలో ఖట్టర్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్యాసెంజర్‌ వెహికల్ మార్కెట్లో 50 శాతం వాటా మారుతీదే ఉండడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 

2007లో రిటైరయిన తర్వాత ఖట్టర్‌.. కార్నేషన్‌ ఆటో పేరిట మల్టీ బ్రాండ్‌ కార్‌ సర్వీస్‌ చైన్‌ సంస్థను నెలకొల్పారు. కానీ, అది అనుకున్న స్థాయిలో విజయం సాధించ లేకపోయింది. చివరకు పంజాబ్‌ బ్యాంక్‌కు ఈ సంస్థ వల్ల రూ.110 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలతో ఖట్టర్‌తో పాటు కార్నేషన్‌ ఆటోపై సీబీఐ కేసు నమోదు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని