జోరులో బేర్‌! - Mixed results for IPOs this year
close

Published : 03/04/2021 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జోరులో బేర్‌!

మార్చిలో ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదైన 4 షేర్లు

18% నష్టంతో ట్రేడవుతోన్న కల్యాణ్‌ జువెలర్స్‌

మిగతా ఐదు కంపెనీల  షేర్ల రాణింపు 

ప్రస్తుత సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూలు హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్లాట్‌ఫాంపై 15 కంపెనీల ఇష్యూలు సందడి చేశాయి. ఇందులో తొమ్మిది ఐపీఓలు (తొలి పబ్లిక్‌ ఆఫర్‌) మార్చిలోనే జరగడం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. స్టాక్‌ మార్కెట్‌ జోరు మీదున్నప్పటికీ ఈ తొమ్మిదింటిలో నాలుగు కంపెనీల షేర్లు ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదవ్వడమే. కల్యాణ్‌ జువెలర్స్‌ అత్యధికంగా 13.45 శాతం తక్కువగా నమోదుకాగా.. ఇప్పటికీ 17.87 శాతం నష్టంతోనే ఉంది. సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, అనుపమ్‌ రసాయన్, క్రాఫ్ట్‌మన్‌ ఆటోమేషన్‌ షేర్లూ ఇంచుమించు ఇదే బాటలో పయనిస్తున్నాయి. 
*మార్చిలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన అనుపమ్‌ రసాయన్‌ షేరు ఇష్యూ ధర కంటే 5.24 శాతం తక్కువగా నమోదైంది. ప్రస్తుతం ఇష్యూ ధర కంటే 6.83 శాతం నష్టంతో ఉంది. క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ షేర్లు 3.83%, సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు 9.44% చొప్పున ఇష్యూ ధర కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇవి వరుసగా 10.13%, 6.83% మేర మదుపర్లకు నష్టాన్ని మిగిల్చాయి. 
*మార్చిలో పబ్లిక్‌ ఇష్యూ స్పందన పరంగానే కాకుండా నమోదులోనూ నజారా టెక్నాలజీస్‌ అదరగొట్టింది. ఈ గేమింగ్‌ సంస్థ షేర్లు మార్చి 30న ఇష్యూ ధర కంటే 43.22 శాతం అధికంగా రూ.1,576.80 వద్ద నమోదయ్యాయి. ఏప్రిల్‌ 1న ట్రేడింగ్‌ ముగిసేనాటికి ఈ షేరు ఇష్యూ ధర కంటే 17.87 శాతం లాభంతో ఉంది. 
*మార్చి 15న ఎక్స్ఛేంజీలో నమోదైన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ షేర్లూ అదరగొట్టాయి. ఆ రోజు ఇష్యూ ధర కంటే 88.22% ఎక్కువగా నమోదైన ఈ కంపెనీ షేర్లు.. ఇప్పటికీ 81.74% మేర లాభంతో ట్రేడవుతోంది. 
*గత నెలలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఇప్పటివరకు ఆకట్టుకునే ప్రదర్శననే కనబర్చాయి. ఈ షేరు ప్రస్తుతం ఇష్యూ ధర కంటే 39.19% మేర లాభాల్లో ఉంది. ఈజీ ట్రిప్‌ ప్లానర్స్, హెరాన్బా ఇండస్ట్రీస్‌ షేర్లు కూడా ఇప్పటివరకు మదుపర్లకు లాభాలనే పంచాయి. 
*జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు చూస్తే ఇండిగో పెయింట్స్, న్యూరెకా కంపెనీల షేర్లు మెరుగ్గానే నమోదైనప్పటికీ.. ఆ తర్వాత ఆ దూకుడు నెమ్మదించింది. ఇండిగో పెయింట్స్‌ షేరు ఫిబ్రవరి 2న ఇష్యూ ధర కంటే 109.31% ఎక్కువగా నమోదైంది. ఏప్రిల్‌ 1న ట్రేడింగ్‌ ముగిసే నాటికి ఇష్యూ ధర కంటే 59.86% లాభంలోనే ఉండటం గమనార్హం. న్యూరెకా కంపెనీ షేరు ఇష్యూ ధర కంటే 66.66 శాతం ఎక్కువగా నమోదైనప్పటికీ.. ప్రస్తుతం ఆ లాభం 50.46 శాతానికే పరిమితమైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని