రిలయన్స్‌ రిటైల్‌ వాటాదార్ల సమావేశంపైఎన్‌సీఎల్‌టీ తీర్పు రిజర్వు - NCLT Judgment Reserve on Reliance Retail Shareholders Meeting
close

Published : 23/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ రిటైల్‌ వాటాదార్ల సమావేశంపైఎన్‌సీఎల్‌టీ తీర్పు రిజర్వు

ముంబయి: ఫ్యూచర్‌ గ్రూప్‌తో రూ.24,700 కోట్ల లావాదేవీకి సంబంధించి వాటాదార్ల సమావేశం నిర్వహించేందుకు అనుమతించాలని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) రిజర్వు చేసింది. ఒప్పందంపై ఆమోదం పొందేందుకు ఆగస్టు 3న వాటాదార్ల సమావేశం నిర్వహించేందుకు  ట్రైబ్యునల్‌ అనుమతిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ కోరింది. ఈ లావాదేవీ జరగకుండా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అడ్డుపడుతోంది. రిలయన్స్‌ రిటైల్‌తో ఒప్పందం పూర్తికి గడువును మార్చి 31 నుంచి సెప్టెంబరు 30కు పొడిగించినట్లు ఫ్యూచర్‌ రిటైల్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఫ్యూచర్‌ గ్రూప్‌, అమెజాన్‌ల మధ్య కేసును జులైలో సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు విచారించనుంది.

త్వరలో జాతీయ ఏక గవాక్ష విధానం
* వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయెల్‌

దిల్లీ: భారత్‌లో వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకోవడానికి జాతీయ ఏక గవాక్ష వ్యవస్థ తొలి దశను త్వరలోనే తీసుకురానున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. తొలి దశ కింద 17 మంత్రిత్వ శాఖలు, విభాగాలు; 14 రాష్ట్రాలు ఉంటాయని సమీక్షా సమావేశం సందర్భంగా తెలిపారు. భూ సేకరణ మొదలు  మొత్తం సమాచారాన్ని, సదుపాయాలను ఈ గవాక్షం ద్వారా వ్యాపారులు పొందవచ్చని ఆయన వివరించారు. అన్ని సమస్యలు, అవసరాలకు ఈ ఏక గవాక్షం పరిష్కారం కాగలదని వివరించారు. ఈ ప్లాట్‌ఫాంపై వినియోగిస్తున్న కీలక డేటా భద్రత అంశాన్నీ గట్టిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

5జీ కంటే 50 రెట్ల వేగంతో 6జీ: శామ్‌సంగ్‌

దిల్లీ: 5జీతో పోలిస్తే 50 రెట్ల వేగంతో డేటాను బదిలీ చేసేందుకు 6జీ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలిందని కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌లో సెకనుకు 5.23 గిగాబైట్ల వేగాన్ని సాధించినట్లు శామ్‌సంగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓనిల్‌ రోహ్‌ తెలిపారు. 6జీ సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది. దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 5జీ కంటే 50 రెట్ల వేగంతో డేటాను బదిలీ చేసే వీలుంటుందని, 2028కి ఇది సాకారం కావచ్చని, 2030కి వాణిజ్య పరంగా అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని