కొవిడ్‌-19 బాధిత ఉద్యోగులకు నామ్‌ ఇండియా ఆర్థిక సాయం - Nam India Financial Assistance to Kovid-19 Affected Employees
close

Published : 08/06/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19 బాధిత ఉద్యోగులకు నామ్‌ ఇండియా ఆర్థిక సాయం

దిల్లీ: కొవిడ్‌ బాధితులైన తమ ఉద్యోగుల కుటుంబాలకు ‘ఫ్యామిలీ సపోర్ట్‌ ప్లాన్‌’ పేరుతో ఆర్థిక సాయం అందించనున్నట్లు నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (నామ్‌ ఇండియా) ప్రకటించింది.  ఎవరైనా ఉద్యోగి కొవిడ్‌తో మరణిస్తే రెండేళ్ల వార్షిక వేతనానికి సమానంగా లేదా కనిష్ఠంగా రూ.20 లక్షలు ఒకేసారి అతని భాగస్వామికి లేదా తల్లిదండ్రులకు అందిస్తామని, ఒకవేళ నెలవారీ ఆదాయ పథకం కావాలంటే ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి నెలవారీగా అందిస్తామని నామ్‌ ఇండియా తెలిపింది. 21 ఏళ్ల లోపు ఇద్దరు సంతానం ఉంటే వారి పేరు మీద రూ.2.5 లక్షల కార్పస్‌ నిధి ఏర్పాటు చేసి వారి చదువులకు ఖర్చు చేస్తామని పేర్కొంది. ఆ కుటుంబంలో నైపుణ్యం ఉన్న వారు ఉంటే ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది. కుటుంబ సభ్యులకు 36 నెలల పాటు మెడిక్లెయిమ్‌ కవర్‌ అయ్యేలా చూస్తామని, బీమా ప్రీమియం కంపెనీనే చెల్లిస్తుందని వివరించింది.

క్యాష్‌ఫ్రీలో ఎస్‌బీఐ పెట్టుబడి
ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ చెల్లింపులు, బ్యాంకింగ్‌ సాంకేతికత అందించే క్యాష్‌ఫ్రీలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పెట్టుబడులు పెట్టింది. ఇది ఎంత మొత్తం అనే విషయాన్ని ఇరు సంస్థలూ వెల్లడించలేదు. క్యాష్‌ఫ్రీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4.2 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. సంస్థ విలువ దాదాపు 20 కోట్ల డాలర్లకు చేరుకుందని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్‌ సిన్హా తెలిపారు. కొత్తగా సమీకరించిన నిధులను చెల్లింపు సేవల విస్తరణకు ఉపయోగిస్తామన్నారు. ప్రముఖ సంస్థలు జొమాటో, క్రెడ్‌, నైకా, ఆకో తదితరాలు క్యాష్‌ఫ్రీ సేవలను వినియోగించుకుంటున్నాయి. అమెరికా, కెనడా, యూఏఈలోనూ ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి.

కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్‌
రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ వెల్లడి  
ఈనాడు, హైదరాబాద్‌

కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్‌ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ వెల్లడించింది. తొలి దశలో హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు, ఆదిత్యపూర్‌, చెన్నైలలో, తదుపరి  మరో ఇరవైకి పైగా నగరాల్లో రీసైక్లింగ్‌ సదుపాయాలను నెలకొల్పుతుంది. దీనికోసం ప్రయాణికుల- సరకు రవాణా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు రాంకీ వెల్లడించింది. దేశంలో 2025 నాటికి కాలం చెల్లే వాహనాలు రెండు కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఈ వాహనాలను సరైన పద్ధతిలో రీసైకిల్‌ చేయకపోతే వాయు కాలుష్యం పెరుగుతుందనే, కేంద్ర ప్రభుత్వం వాహనాల తుక్కు విధానాన్ని ఆవిష్కరించించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, విధానాలతో ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు రాంకీ వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని