Bajaj Pulsar: అత్యంత పవర్‌ఫుల్‌ పల్సర్‌ ఇదేనట.. మరి ఫీచర్లివేనా? - New Bajaj Pulsar 250 to be most powerful Pulsar yet
close

Published : 25/10/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bajaj Pulsar: అత్యంత పవర్‌ఫుల్‌ పల్సర్‌ ఇదేనట.. మరి ఫీచర్లివేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త డిజైన్‌తో రానున్న బజాజ్‌ పల్సర్‌ 250తో పాటు మరో కొత్త బైక్ పల్సర్‌ 250ఎఫ్‌ ఈ నెల 28న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఇటీవల ఈ బైక్‌లకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు వచ్చిన పల్సర్‌ బైక్‌లలో ఇవే అత్యంత శక్తిమంతమైనవిగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అత్యంత శక్తిమంతమైనది..

కొత్త పల్సర్‌ 250.. 27 హెచ్‌ఫీ శక్తిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే ప్రస్తుతం పల్సర్‌ మోడల్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా పేర్కొంటున్న 220ఎఫ్‌, ఆర్‌ఎస్‌200, పల్సర్ ఎన్‌ఎస్‌200 కంటే కూడా ఇది ఎక్కువ శక్తిని విడుదల చేయనుంది. ఇంజిన్‌ను సైతం కొత్తగా డిజైన్‌ చేసినట్లు ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

డిజైన్‌లో భిన్నమైన పల్సర్‌..

ఈ కొత్త పల్సర్‌ 250 లుక్ విషయానికి వస్తే స్పోర్టీ స్టైలింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా ఎన్‌ఎస్‌200ని పోలి ఉన్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. అయితే, దాని కంటే కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందు భాగం 220ఎఫ్‌ని తలపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, మొత్తంగా బైక్‌ లుక్ మాత్రం ఇప్పుడు ఉన్న పల్సర్‌ బైక్‌లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ..

ఇక కొత్త పల్సర్‌ 250లో పలు ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్‌తో పాటు కొత్తగా వస్తున్న రెండు బైక్‌లలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెనుకభాగంలో మోనోషాక్‌ అబ్జర్బర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ కూడా ఉండనున్నట్లు సమాచారం.

220ఎఫ్‌ స్థానంలోనే 250ఎఫ్‌?

పల్సర్‌ 220ఎఫ్‌లో చాలాకాలంగా ఎలాంటి మార్పులు లేవు. అయితే, 220ఎఫ్‌కు ఉన్న డీసెంట్‌ లుక్‌ను మార్చొద్దని బజాజ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 220ఎఫ్‌ను కొనసాగిస్తూనే.. దాని కంటే మెరుగైన అత్యాధునిక ఫీచర్లతో 250ఎఫ్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే, విడుదల తర్వాత రెండూ అందుబాటులో ఉంటాయా.. లేదా 220 ఎఫ్‌ను 250ఎఫ్‌ పూర్తిగా రీప్లేస్‌ చేస్తుందా చూడాలి.

ధరెంతో మరి?

ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన పల్సర్ల కంటే తాజా పల్సర్‌ 250 శక్తిమంతమైనది అంటున్న నేపథ్యంలో అన్నింటి కంటే ఖరీదైన పల్సర్‌ ఇదే కావొచ్చని అంటున్నారు. ప్రారంభ ధర రూ.1.60లక్షలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారిక వివరాల కోసం 28వరకు వేచి చూడాల్సిందే.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని