Stock Market: జీవితకాల గరిష్ఠాలకు సూచీలు.. లాభాల్లో మునిగి తేలిన మదుపర్లు! - Nifty Surpasses 16000 Mark For First Time
close

Updated : 03/08/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: జీవితకాల గరిష్ఠాలకు సూచీలు.. లాభాల్లో మునిగి తేలిన మదుపర్లు!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం నష్టాలు మూటగట్టుకున్న మదుపర్లు ఈరోజు లాభాల్లో మునిగి తేలారు. రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారి 16 వేల మార్క్‌ను దాటింది. ఓ దశలో సెన్సెక్స్‌ 937 పాయింట్లు లాభపడి 53,887 వద్ద.. నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకి 16,146 వద్ద జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 872 పాయింట్లు లాభపడి 53,823 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 16,130 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.26 వద్ద స్థిరపడింది.

ఒక్క లోహ మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ నష్టాలు చవిచూశాయి.

కారణాలివే...

మహమ్మారి వల్ల కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు, తయారీ కార్యకలాపాలు మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు 33 శాతం పుంజుకోవడం వంటి సానుకూల సంకేతాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, టైటన్‌, టీసీఎస్‌, ఎయిర్‌టెట్‌ వంటి కీలక కంపెనీల షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా ఎలాంటి ఆశాజనక సంకేతాలు లేకపోయినప్పటికీ.. దేశీయంగా కరోనా కొంత మేర కట్టడిలో ఉండడం మదుపర్లలో ఆశలు నింపినట్లు కనిపిస్తోంది. పైగా వ్యాక్సినేషన్‌ పురోగతి మూడో వేవ్‌ను వాయిదా వేసే అవకాశం ఉందన్న సూచనలు మార్కెట్‌ సెంటిమెంటును పెంచినట్లు తెలుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని