close

తాజా వార్తలు

కెప్టెన్‌ నిర్మలమ్మ.. జట్టులో ఎవరంటే

బడ్జెట్‌ బృందంపై ప్రత్యేక కథనం

ఓవైపు తగ్గుముఖం పడుతున్న జీడీపీ.. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యలోటు ఆందోళన కలిగిస్తున్నాయి.. క్షీణిస్తున్న వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతి.. ప్రజల్లో తగ్గుతున్న కొనుగోలు శక్తి.. ఫలితంగా బలపడిన ఆర్థిక మందగమనం.. మాంద్యంగా మారుతుందనే భయాలు.. ఇలా ఎన్నో సవాళ్ల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, వృద్ధిరేటును పెంచేందుకు ఈసారి బడ్జెట్‌లో అనేక కీలక ప్రతిపాదనలు, సంస్కరణలు వెలువడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ దృక్పథాన్ని తన బృందానికి వెల్లడించి సరైన ప్రతిపాదనలు చేయించడంలో ఆర్థిక మంత్రి అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ బృందం కూడా చతురతతో పనిచేయాలి. మరి ఈ సారి మన నిర్మలమ్మ బడ్జెట్‌ బృందంలో ఉన్న కీలక వ్యక్తులెవరో తెలుసుకుందాం..

నిర్మలా సీతారామన్‌(ఆర్థిక మంత్రి)

మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను చేపట్టారు నిర్మలా సీతారామన్‌. సార్వత్రిక ఎన్నికల అనంతరం గతేడాది జులైలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం ఇదే తొలిసారి. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తిచేసిన నిర్మల.. సేల్స్‌ గర్ల్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో లండన్‌లోని ఓ స్టోర్‌లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 

కె. సుబ్రమణియన్‌(ముఖ్య ఆర్థిక సలహాదారు)

షికాగో విశ్వవిద్యాలయంలో ‘బూత్‌ స్కూల్‌’ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన కె. సుబ్రమణియన్‌.. గతేడాది జులైలో తన తొలి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 8శాతం వృద్ధి రేటును సాధించేందుకు, 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు తన సర్వేలో అనేక కీలక ప్రతిపాదనలు చేశారు. మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చేలా ఆర్థికశాఖ ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలనేదే ప్రస్తుతం సుబ్రమణియన్‌ ముందున్న లక్ష్యం.

రాజీవ్‌ కుమార్‌(ఆర్థిక, ఆర్థిక సేవల కార్యదర్శి)

ఆర్థిక శాఖలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈయన. గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రాజీవ్‌.. బ్యాంకింగ్‌ సంస్కరణల్లో ముఖ్య పాత్ర పోషించారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనం, మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడం వంటి వాటిల్లో కీలకంగా మారారు. బ్యాంకింగ్‌ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి, వినిమయాన్ని పెంచేందుకు ఆయన గురుతర బాధ్యత పోషించాల్సి ఉంటుంది. 

అజయ్‌ భూషణ్‌ పాండే(రెవెన్యూ కార్యదర్శి)

ఆధార్‌ విజయానికి పనిచేసిన అతికొద్ది మంది వ్యక్తుల్లో పాండే ఒకరు. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో రెవెన్యూ వసూళ్లు అంచనాల కంటే తగ్గిపోవడంతో పాండే మీద కాస్త ఒత్తిడి ఎక్కువే ఉంది. దీంతో గతేడాది కార్పొరేట్‌ పన్నుల తగ్గించారు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కీలక ప్రతిపాదనలు చేస్తారనే అంచనాలున్నాయి. 

అతాను చక్రవర్తి(ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి)

చక్రవర్తి గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. సృజనాత్మక ఆలోచనలతో పెట్టుబడుల ఉపసంహరణను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. గతేడాది జులై బడ్జెట్‌ తర్వాత ఆయన పెట్టుబడుల ఉపసంహరణ విభాగం నుంచి ఆర్థిక వ్యవహారాల విభాగానికి మారారు. వృద్దిరేటు 5శాతం కంటే కిందకు పడిపోయిన నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చక్రవర్తి బృందం 1 ట్రిలియన్‌ డాలర్లతో మౌలికసదుపాయాల పెట్టబడుల బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. ద్రవ్యలోటును తగ్గించేందుకు ఈయన ప్రతిపాదనలు కీలకంగా మారనున్నాయి. 

టీవీ సోమనాథన్‌(ఎక్సెపెండీచర్‌ సెక్రటరీ)

కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన సోమనాథన్‌ ప్రపంచ బ్యాంక్‌లో పనిచేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీగా వ్యవహరించారు. ఇటీవలే ఆర్థిక శాఖలో చేరిన సోమనాథన్‌ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వృథా వ్యయాలు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను హేతుబద్ధీకరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. గతంలో పీఎంవోలో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌  ప్రతిపాదనలు చేస్తారనే నమ్మకం ఉంది. 

తుహిన్‌ కాంత పాండే(పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి)

గతేడాది అక్టోబరులో పాండే పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియా విక్రయ బాధ్యతలు ఈయన పైనే ఉన్నాయి. ఎయిరిండియా కొనుగోలుకు బిడ్లను ఆహ్వానిస్తూ సోమవారమే అధికారిక ప్రకటన జారీ అయ్యింది. గతంలో 76శాతం వాటా విక్రయ ప్రయత్నాలు విఫలమవడంతో ఈసారి కొన్ని విధానపరమైన మార్పులతో 100శాతం వాటాలను విక్రయానికి పెట్టారు. దీంతో పాటు ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.