GST Council Meeting: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌.. ఇది సమయం కాదు: నిర్మలా సీతారామన్‌ - Nirmala Sitharaman on Petrol Diesel Under GST
close

Updated : 17/09/2021 20:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GST Council Meeting: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌.. ఇది సమయం కాదు: నిర్మలా సీతారామన్‌

లఖ్‌నవూ: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని వివరించారు. లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ అనంతరం కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కొవిడ్‌ సంబంధిత ఔషధాలపై తగ్గింపు డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రస్తుతం సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంది. అలాగే, క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలీవరి సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదన్నారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్‌ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని