కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం - No change in key interest rates rbi
close

Updated : 07/04/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం

ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడించిన ఆర్‌బీఐ

ముంబయి: కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపోరేటు, 3.3 శాతం రివర్స్‌ రెపోరేటు వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగనున్నాయి. 2021-22లో జీడీపీ వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ఆంచనా వేసింది. ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కమిటీ నిర్ణయాలను శక్తికాంతదాస్‌ బుధవారం ప్రకటించారు.

సర్దుబాటు విధాన వైఖరికే మొగ్గు..

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షల విధింపు నేపథ్యంలో ప్రస్తుతమున్న సర్దుబాటు విధాన వైఖరి కొనసాగింపునకే ఆర్‌బీఐ మొగ్గుచూపింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మొదటి ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాలపై ఆర్‌బీఐ ప్రధానంగా దృష్టి సారించింది.

ప్రథమార్ధంలో 5.2 శాతం ద్రవ్యోల్బణం..

తాజాగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు ఆర్థిక వృద్ధి పునరుత్తేజంలో అస్థిరతను పెంచాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తూ ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండేలా ఆర్‌బీఐ చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. మూడో త్రైమాసికం నాటికి అది 4.4 శాతానికి పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది.

రాష్ట్రాల చేబదుళ్ల పరిమితి పెంపు..

ప్రభుత్వ రుణాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి.. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్‌ తెలిపారు. దేశీయ ఆర్థిక సంస్థలపై అంరత్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ప్రభావాన్ని నిరోధించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. 2021-22లో తాజా రుణాల కోసం నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ, ఎస్‌ఐడీబీఐకి రూ.50 వేల కోట్ల అదనపు లిక్విడిటీ సౌకర్యాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. అలాగే రాష్ట్రాలకిచ్చే స్థూల చేబదుళ్ల(వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌) పరిమితిని రూ.47,010 కోట్లకు పెంచింది. ఇక కొవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకు మధ్యంతర రూ.51,560 కోట్ల చేబదుళ్ల కాలపరిమితిని సెప్టెంబరు వరకు పొడిగించింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని