No-Cost EMI: నో-కాస్ట్‌ ఈఎంఐ అంటే అసలే వడ్డీ ఉండదా..? ఇది ఎంతవరకు మేలు? - No cost EMIs are not cost free
close

Published : 21/10/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

No-Cost EMI: నో-కాస్ట్‌ ఈఎంఐ అంటే అసలే వడ్డీ ఉండదా..? ఇది ఎంతవరకు మేలు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామ‌ర్స్ దిగ్గజ సంస్థలు పండగ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప‌లు ర‌కాల వ‌స్తువుల‌పై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాంకులు, పేమెంట్ ఫిన్‌టెక్‌లు, ఇత‌ర ఆర్థిక సంస్థలు ఇచ్చే అదనపు ఆఫ‌ర్లు కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్యంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్. ఇందులో పేరుకు త‌గిన‌ట్లుగానే వినియోగ‌దారులు వ‌స్తువు కొనుగోలుధ‌ర‌ను వాయిదాల ప‌ద్ధతిలో చెల్లించొచ్చు. ఇందుకు అద‌న‌పు ఖ‌ర్చు (రుణానికి సంబంధించిన వ‌డ్డీ) ఉండ‌దు. మ‌రి నో-కాస్ట్ ఈఎంఐలో వ‌స్తువు కొంటే నిజంగానే రుణ మొత్తంపై వ‌డ్డీ చెల్లించాల్సిన అవసరం లేదా? అసలు నో-కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? ఆ వివరాలు తెలుసుకుందాం..

నో-కాస్ట్ ఈఎంఐ అంటే..?

నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక ఆఫర్. ఈ స్కీమ్ కింద కొనుగోలు చేసిన వస్తువు ధ‌ర‌ను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. వస్తువు ధ‌ర‌ను ఇచ్చిన కాల‌ప‌రితి ఆధారంగా స‌మాన భాగాలుగా విభ‌జిస్తారు. ఇందుకు అద‌న‌పు మొత్తాన్ని చెల్లించాల్సిన ప‌నిలేదు.

వ‌డ్డీ చెల్లించన‌క్కర్లేదా..?

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్రకారం ఏ సంస్థ కూడా సున్నా వ‌డ్డీతో రుణాలు ఇవ్వకూడదు. మ‌రి నో-కాస్ట్ ఈఎంఐ ఎలా సాధ్యమవుతోంది అనే సందేహం రావొచ్చు. నిజానికి నో-కాస్ట్ ఈఎంఐ కింద వ‌స్తువు కొనుగోలు చేసినప్పటికీ.. అందుకు తీసుకున్న రుణంపై కూడా వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. అయితే ఈ వ‌డ్డీని సంస్థలు రెండు ర‌కాలుగా వ‌సూలు చేస్తాయి.

* ఓ వస్తువును ‘నో-కాస్ట్‌ ఈఎంఐ’ విధానంలో కొనుగోలు చేసినప్పుడు ‘నో-కాస్ట్‌ ఈఎంఐ డిస్కౌంట్‌’గా ఈ-కామర్స్‌ సంస్థ కొంత మొత్తాన్ని బిల్లు నుంచి ముందుగానే తగ్గిస్తుంది. ఈఎంఐ అమౌంట్‌ మీ క్రెడిట్‌ కార్డులో బిల్లింగ్‌ అయ్యేటప్పుడు అంతే మొత్తంలో మీ నుంచి బ్యాంకులు వడ్డీ రూపంలో వసూలు చేస్తాయని చెబుతుంది. నిజానికి ఈ-కామర్స్‌ సంస్థ చెల్లించే వడ్డీ మొత్తం కంటే.. మీ దగ్గర బ్యాంకులు వడ్డీ రూపంలో వసూలు చేసే మొత్తం కొంత అధికంగా ఉండొచ్చు. వడ్డీ రూపంలో ఎంత వసూలు చేస్తారనేది ఈ-కామర్స్‌ సంస్థలు ఆ సందర్భంలో చెప్పవు. అయితే సేల్‌ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌, ఆఫర్ల నియమ నిబంధనల్లో పొందుపరుస్తారు.

* ఇక రెండో పద్ధతి ప్రకారం.. వినియోగ‌దారుడు ఈ స్కీమ్ కింద వ‌స్తువు కొనుగోలు చేస్తే... ఆ వ‌స్తువుపై ఈ-కామర్స్‌ సంస్థ ఇస్తున్న డిస్కౌంట్ ర‌ద్దు చేసి వస్తువును అస‌లు ధ‌ర‌కే విక్రయిస్తుంది. అంటే వినియోగదారుడికి ఇస్తామని చెప్పిన కార్డు డిస్కౌంట్‌ ఉండదన్నమాట. కార్డు పేమెంట్‌ అప్పుడు ఇచ్చే ముందస్తు ‘నో-కాస్ట్‌ ఈఎంఐ డిస్కౌంట్‌’... తిరిగి చెల్లించేటప్పుడు వేసే పూర్తి వడ్డీ అనేవి మొదటి విధానం ప్రకారమే ఉంటాయి. అయితే, ఈ తరహా నో-కాస్ట్‌ ఈఎంఐలను కొన్ని సందర్భాల్లోనే ఇ-కామర్స్‌ సంస్థలు వినియోగిస్తుంటాయి. ఈ రెండు విధానాల్లో ఈఎంఐలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. 

ప్రయోజనం ఏమిటి...?

నిక‌ర వ్యయంలో వ్యత్యాసం లేకపోయినప్పటికీ ఎక్కువ విలువ గ‌ల వ‌స్తువును వాయిదాల ప‌ద్ధతిలో కొనుగోలు చేయ‌గ‌లుగుతారు. అలాగే రుణం కోసం ప్రత్యేకంగా ద‌ర‌ఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. తక్షణమే పథకాన్ని ఎంచుకుని ఒకేసారి వస్తువును కొనుగోలు చేయొచ్చు.

చివరగా: నో-కాస్ట్ ఈఎంఐ అనేది పూర్తిగా జీరో వడ్డీ లేదా జీరో ప్రాసెసింగ్ ఈఎంఐ కాదు. మీరు ఇప్పటికీ వడ్డీతో పాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు ఒకసారి ఈ ధరను తనిఖీ చేయండి..


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని