టీకాల తయారీలోకి అడుగుపెట్టే యోచన లేదు: సన్‌ ఫార్మా - No plans to enter into vaccine preparation Sun‌ Pharma
close

Published : 14/06/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల తయారీలోకి అడుగుపెట్టే యోచన లేదు: సన్‌ ఫార్మా

దిల్లీ: టీకాల తయారీలోకి అడుగుపెట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి యోచన చేయడం లేదని సన్‌ ఫార్మా తెలిపింది. టీకా తయారీకి ప్రత్యేక తయారీ మౌలిక సదుపాయాలు అవసరమని గుర్తుచేసింది. ప్రస్తుతం వివిధ జనరిక్‌ ఔషధాల తయారీకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న ఈ సంస్థ, భవిష్యత్‌లో మరింత వృద్ధి సాధించేందుకు బయోసిమిలర్ల విభాగంపై దృష్టి సారించాలని అనుకుంటోంది. ‘టీకాలు తయారు చేయాలంటే, వాటి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్లు అవసరం అవుతాయని మా అభిప్రాయం. ప్రస్తుతం మేం  ఔషధాలు తయారుచేస్తున్న ప్లాంట్లలో టీకాలను తయారు చేయడం వీలు కాద’ని విశ్లేషకులకు సన్‌ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ సంఘ్వీ తెలిపారు. భవిష్యత్‌లో వివిధ బయోసిమిలర్‌ ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు.

రిటైల్‌ ఎన్‌పీఏలపై ప్రైవేటు ఏఆర్‌సీల దృష్టి

ముంబయి: బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులను బదలాయించేందుకు బ్యాడ్‌బ్యాంకును ప్రారంభించనున్న తరుణంలో, రిటైల్‌ రుణాల్లో పెరుగుతున్న మొండి బకాయిలను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీ) ఉత్సుకత చూపుతున్నాయి. దేశీయంగా ఏఆర్‌సీ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1.5 లక్షల కోట్లు ఉంటుంది. దాదాపు 12 కంపెనీలు ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ఎడెల్‌వీస్‌ ఏఆర్‌సీ వాటాయే 30 శాతం ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకులు నిధులు అందించే జాతీయ బ్యాడ్‌బ్యాంక్‌ కార్యకలాపాలు ఆరంభమైతే, తాము పోటీపడలేమని ప్రైవేటు ఏఆర్‌సీలు భావిస్తున్నాయి. రుణ పునర్‌వ్యవస్థీకరణ, మారటోరియానికి తోడు రూ.500 కోట్లకు మించిన కార్పొరేట్‌ ఎన్‌పీఏలను బ్యాడ్‌బ్యాంక్‌కు అప్పగించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే కొవిడ్‌ పరిణామాల ఫలితంగా రిటైల్‌ రుణాల్లోనూ నిరర్థక ఆస్తులు పెరుగుతున్నందున, ఈ విభాగంపై ప్రైవేటు ఏఆర్‌సీలు దృష్టి పెడుతున్నాయి. ఏఆర్‌సీల ఆస్తుల్లో దాదాపు 25 శాతం రిటైల్‌ విభాగం నుంచే వచ్చాయని చెబుతున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌తో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలైన బజాజ్‌ ఫైనాన్స్‌ వంటివి ఒత్తిడికి గురవుతున్న వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డుల బకాయిలను ఎడెల్‌వీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నిర్వహించే ఫియొనిక్స్‌ ఏఆర్‌సీ, జేఎం ఫైనాన్షియల్‌, రిలయన్స్‌ ఏఆర్‌సీ వంటి వాటికి విక్రయిస్తున్నాయి. రిలయన్స్‌ ఏఆర్‌సీ కేవలం రిటైల్‌ రుణాలు మాత్రమే కొనుగోలు చేస్తుండగా, ఫియొనిక్స్‌ ఏఆర్‌సీకి ఉన్న రూ.8500 కోట్ల ఆస్తుల్లో 20 శాతం ఇవే ఉన్నాయి. ఎడెల్‌వీస్‌ గత ఆర్థిక సంవత్సరంలో 179 ఖాతాల నుంచి రూ.5400 కోట్లు రికవరీ చేసింది. రాబోయే రెండేళ్లలో ఏఆర్‌సీ ఆస్తుల్లో 50 శాతం రిటైల్‌ విభాగం నుంచే ఉంటాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఈ విభాగంలో రికవరీ బాగుండటం, మార్జిన్లు అధికంగా ఉండటం ఏఆర్‌సీలను ఆకర్షిస్తోంది. రిటైల్‌లో 60-70 పైసల వాటాకే ఎన్‌పీఏలు లభిస్తున్నాయి. కొన్నిసార్లు లాభాల్లో వాటాల పద్ధతిలో ఏఆర్‌సీలు స్వాధీనం చేసుకుంటున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని