ఓఎన్‌జీసీ సహజ వాయువు ధర స్పల్పంగా పెంపు - ONGC raises natural gas prices
close

Published : 24/03/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓఎన్‌జీసీ సహజ వాయువు ధర స్పల్పంగా పెంపు

 రిలయన్స్‌-బీపీకి 4 డాలర్ల దిగువకు

దిల్లీ: ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేసే సహజవాయవుకు చెల్లించే ధరను ప్రభుత్వం స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. ‘ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు కేటాయించిన చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయిన గ్యాస్‌కు చెల్లించే ధర 1.82 డాలర్లకు (మిలియన్‌ బ్రిటీషు థర్మల్‌ యూనిట్‌కు) పెరగొచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి ఆరు నెలల కాలానికి ఈ ధర ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర దశాబ్ద కనిష్ఠ స్థాయైన 1.79 డాలర్లుగా ఉంద’ని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా కష్టతరమైన క్షేత్రాల (డీప్‌ సీ/ సముద్రం లోతుల్లో ఉండే) నుంచి రిలయన్స్‌- బీపీ ఉత్పత్తి చేసే గ్యాస్‌కు చెల్లించే ధర 4 డాలర్ల దిగువకు రావొచ్చు. ప్రస్తుతం మిలియన్‌ బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్‌ సహజవాయువుకు 4.06 డాలర్ల ధరను చెల్లిస్తోంది. న్యూ ఎక్స్‌ప్లోరేషన్‌ లైసెన్సింగ్‌ పాలసీ కింద దక్కించుకున్న కష్టతరమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్‌కు ఇప్పటివరకు ఆర్‌ఐఎల్‌-బీపీ పొందిన గరిష్ఠ ధర ఇదే. అమెరికా, కెనడా, రష్యా లాంటి దేశాల్లోని సహజవాయువు మిగులు నిల్వల ఆధారంగా ఏటా రెండు సార్లు (ఏప్రిల్‌ 1న, అక్టోబరు 1న) ప్రభుత్వం సహజవాయువు ధరలను నిర్ణయిస్తుంది.


అపరిమిత కాలావధి బాండ్ల నిబంధనల్లో సడలింపు

దిల్లీ: అపరిమిత కాలావధి ఉండే పర్పెచ్యువల్‌ బాండ్లకు సంబంధించిన నిబంధనల్లో సెబీ సడలింపులు చేసింది. అదనపు టైర్‌-1 బాండ్ల కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలంటూ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న ఆర్థిక శాఖ సూచన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31 వరకు అదనపు టైర్‌-1 (ఏటీ-1) బాండ్ల కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంటుందని సోమవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ తెలిపింది. ఆ తర్వాతి ఆరు నెలల కాలానికి 20 ఏళ్లు, 30 ఏళ్లు చొప్పున ఈ కాలపరిమితిని పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఏటీ-1 బాండ్ల కాల పరిమితి జారీ చేసిన తేదీ నుంచి 100 ఏళ్లుగా ఉంటుందని వెల్లడించింది. దీంతో పాటు బాసెల్‌ 2 టైర్‌ బాండ్ల కాలపరిమితిని 2022 మార్చి వరకు 10 ఏళ్లు లేదా ఒప్పంద సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత నుంచి ఒప్పంద సమయమే వర్తిస్తుందని పేర్కొంది. ఏటీ-1 బాండ్లు కూడా పర్పెచ్యువల్‌ మాదిరిగానే ఉంటాయి. వీటికి కాలపరిమితి అనేది ఉండదు. అంటే అసలును తిరిగి చెల్లించకుండా.. వడ్డీనే చెల్లించుకుంటూ వెళ్తారు.

రిలయన్స్‌లో వాటా కొనుగోలుకు ఇంకా చర్చల్లోనే సౌదీ అరామ్‌కో
దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్రో రసాయనాలు (ఓ2సీ) విభాగంలో 20 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సౌదీ అరామ్‌కో చర్చలు జరుపుతోందని మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. 2020 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా పెట్టుబడిదార్లతో సౌదీ అరామ్‌కో వ్యాఖ్యలను మోర్గాన్‌ స్టాన్లీ ఉటంకించింది. రిలయన్స్‌తో భాగస్వామ్యానికి అవకాశాలను చూస్తున్నట్లు ఆరామ్‌కో తెలిపింది. రిలయన్స్‌ ఓ2సీ విభాగానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు చమురు రిఫైనరీలు, పెట్రోరసాయనాల ఆస్తులు ఉన్నాయి. రిలయన్స్‌ చమురు రిటైలింగ్‌ వ్యాపారంలో 51 శాతం వాటా కూడా ఉంది. ఈ వ్యాపారంలో 20 శాతం వాటాను విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు 2019 ఆగస్టులో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ లావాదేవీ 2020 మార్చిలోనే ముగియాల్సి ఉన్నప్పటికీ.. విలువ లెక్కకట్టే విషయంలో అవగాహన కుదరక జాప్యమవుతూ వస్తోంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని