చమురు ధరలు పైకి.. కొన్ని చోట్ల పెట్రోల్‌ సెంచరీ! - Once again petro prices hiked
close

Updated : 10/05/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చమురు ధరలు పైకి.. కొన్ని చోట్ల పెట్రోల్‌ సెంచరీ!

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్​ను లీటర్​కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది.

ఇతర నగరాల్లో చూస్తే ముంబయిలో పెట్రోల్ ధర రూ. వందకు చేరువవుతోంది. ప్రస్తుతం లీటరు ధర రూ.97.86గా ఉంది. డీజిల్ ధర రూ.89.17కి చేరింది. చెన్నైలో లీటరు ధర రూ.93.38 ఉండగా.. డీజిల్ రూ.86.96కి చేరింది. కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా... రూ.91.66, రూ.84.90గా ఉన్నాయి. మన హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.13, లీటర్‌ డీజిల్‌ రూ.89.47కు లభిస్తోంది.

ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేరాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌కు రూ.100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్‌ పెట్రోల్‌ ధర సోమవారం రూ.100.20కు చేరింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.42, మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లాలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ రూ.102.12కి లభిస్తోంది. దేశంలో ఇలా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100 దాటడం ఈ ఏడాది రెండోసారి.

అమెరికాలోని చమురు పైప్‌లైన్లకు సంబంధించిన మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలపై సైబర్ దాడి జరగడంతో సోమవారం చమురు ధరలు ఒక శాతం మేర ఎగబాకాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76 సెంట్లు పెరిగి 69.04 డాలర్లుగా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని