ధరలు ‘పెట్రో’గకపోవచ్చు..! - Opec countries agreed to increase production
close

Published : 02/04/2021 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధరలు ‘పెట్రో’గకపోవచ్చు..!

ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాల అంగీకారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌+ ఎట్టకేలకు చమురు ఉత్పత్తిని పెంచడానికి అంగీకరించింది. ధరల్ని నియంత్రణలో ఉంచాలంటూ సౌదీ అరేబియాను ఇటీవల అమెరికా కోరింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చమురుకు గిరాకీ పెరుగుతున్న  నేపథ్యంలో.. ఆదాయం సమకూర్చుకునేందుకు ఉత్పత్తిని పెంచాలన్న కూటమి భాగస్వామ్య దేశాలు సౌదీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అలాగే కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌ వంటి కొన్ని అగ్ర దేశాలు లాక్‌డౌన్‌ దిశగా వెళుతున్నాయి. మరికొన్ని దేశాల్లో ఇప్పటికే కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు గత రెండువారాల్లో మందగించినట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. దీంతో మరోసారి చమురు గిరాకీ పడిపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే కూటమిలోని ప్రధాన భాగస్వామ్యపక్షమైన సౌదీ అరేబియా ఉత్పత్తి పెంపునకు అంగీకరించినట్లు సమాచారం. 

మే నెల నుంచి చమురు ఉత్పత్తి క్రమంగా పెరగనుంది. మే నెలలో రోజుకు అదనంగా 3,50,000 బ్యారెళ్లు, జూన్‌లో మరో 3,50,000 బ్యారెళ్లు, జులైలో 4,00,000 బ్యారెళ్లు అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. జులై నాటికి రోజుకి అదనంగా 1.1 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తామని ఇరాక్‌ ఇంధన శాఖ మంత్రి బిజన్‌ ఝంగనే తెలిపారు. అలాగే కరోనా నేపథ్యంలో రోజుకి మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని స్వచ్ఛందంగా తగ్గించామని.. దాన్ని జులై నాటికి క్రమంగా పునరుద్ధరిస్తామని సౌదీ అరేబియా మంత్రి అబ్దులాజిజ్‌ బిన్‌ సల్మాన్‌ సైతం పేర్కొన్నారు. 

కరోనా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వంటి పరిణామాలు గత మార్చి నుంచి గిరాకీని బాగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా స్తంభించిపోవడంతో ముడిచమురు కొనేవారు లేక ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఒక దశలో డబ్ల్యూటీఐ చమురు సూచీ -37 డాలర్లకు కూడా పడిపోయింది. అదే సమయంలో ఒపెక్‌+ దేశాలు చమురు ఉత్తత్తిని భారీగా తగ్గించాయి. వ్యాక్సినేషన్‌ మొదలు కావడంతో కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు క్రమంగా బయటకు వస్తున్న కొద్దీ చమురు గిరాకీ పుంజుకుంటోంది. అయితే, కృత్రిమ డిమాండ్‌ సృష్టించి ఆదాయం పెంచుకొనేందుకు ఉత్పత్తి కోతల్ని మాత్రం ఒపెక్‌+ దేశాలు సడలించలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో భారత్‌లోనూ చమరురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్‌+ తీసుకున్న నిర్ణయం దేశీయంగానూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు కొంత దోహద పడవచ్చు. 

తగ్గించమన్నందుకు భారత్‌తో తగువు పెట్టుకున్నాయి..

అంతర్జాతీయ చమురు ధరల పెంపునకు అనుగుణంగా భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చింది. దీంతో సామాన్యులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి కోతల్ని తగ్గించి ధరల్ని నియంత్రించాలని సౌదీ అరేబియా సహా ఒపెక్‌ను భారత్‌ కోరింది. కానీ, భారత్‌ విజ్ఞప్తిని ఒపెక్‌ దేశాలు తోసిపుచ్చాయి. పైగా, గత ఏప్రిల్‌లో తక్కువ ధర ఉన్నప్పుడు కొన్న చమురు నిల్వల్ని వినియోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా మంత్రి సలహా సబబుగా లేదని స్పష్టం చేశారు. ధరలు పతనమైనప్పుడు భారత్‌ ఒపెక్‌కు అండగా నిలిచిందని గుర్తుచేశారు. చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్పత్తి ప్రారంభించిన గినియా నుంచి భారత్‌ కొనుగోలు కూడా ప్రారంభించింది. ఇలా ఓ దశలో భారత్‌ వాదనను తోసిపుచ్చిన ఒపెక్‌ చివరకు దిగిరాక తప్పలేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని