మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే..  - PPF-withdrawal-rules-before-maturity
close

Updated : 05/05/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే.. 

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌) అనేది ప‌న్ను ఆదా చేసుకోగ‌ల‌ పెట్టుబడి మార్గాల‌లో ఒక‌టి. ఇందులో ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అస‌లు,వ‌డ్డీ రెండింటిపై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం అమ‌లులో ఉన్న వ‌డ్డీ రేటు 7.1 శాతం. దీర్ఘకాలంలో ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావాన్ని అధిగ‌మించ‌డంలో ఈ వ‌డ్డీ రేట్లు స‌హాయ‌ప‌డుతున్నాయి. రిస్క్ ఉండ‌దు కాబ‌ట్టి,  త‌క్కువ ప్ర‌మాదం ఉన్న పెట్టుబ‌డి మార్గాల‌ను అన్వేషించే వారికి ఇది మంచి ఎంపిక‌. 

మెచ్యూరిటి పిరియ‌డ్‌..
ఇందులో 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. అయితే గ‌డువు ముగియ‌క ముందే డ‌బ్బు అత్య‌వ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించిన త‌ర్వాత ఖాతా మొత్తం మూసివేసేందుకు అవ‌కాశం ఉంది. కానీ, దానికి త‌గిన కార‌ణాలు ఉండాలి. ఉదాహ‌ర‌కు ఉన్న‌త విద్య‌, వైద్య చికిత్స వంటివి. కానీ గ‌డువు పూర్తికాక‌ముందే ఖాతాను మూసివేస్తే 1 శాతం వ‌డ్డీ త‌క్కువ‌గా ల‌భిస్తుంది. మ‌రోవైపు 15 సంవ‌త్సారాలు పూర్త‌య్యాక కూడా ఖాతాను కొన‌సాగించే అవ‌కాశం కూడా ఉంది.

పాక్షిక విత్‌డ్రాలు ఎప్పుడు అనుమ‌తిస్తారు.. ఎంత మొత్తం తీసుకోవ‌చ్చు..
పీపీఎఫ్ ఖాతాదారుడు ఏడేళ్ల త‌ర్వాత ఏడాదికోసారి పాక్షికంగా డ‌బ్బును విత్‌డ్రా చేసుకునే వీలుంది. డ‌బ్బు ఉపసంహరించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం (లేదా) సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం.. ఇందులో ఏది.. తక్కువ మొత్తమైతే .. అంత మేర ఉపసంహరించుకోవచ్చు.

రుణ స‌దుపాయం..
పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకునే స‌దుపాయం కూడా ఉంది. ఖాతాపై ల‌భించే వ‌డ్డీ కంటే ఒక శాతం ఎక్కువ వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఖాతా తీసుకున్న మూడ‌వ సంవ‌త్స‌రం నుంచి రుణం తీసుకునే వీలుంది. రుణం తీసుకోవాల‌నుకుంటున్న సంవ‌త్స‌రానికి ముందు రెండు సంవ‌త్స‌రాల ఖాతా నిల్వ‌లో 25 శాతం వ‌ర‌కు రుణంగా పొంద‌చ్చు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 5 సంవ‌త్స‌రం వ‌ర‌కు సంవ‌త్స‌రానికి ఒక‌సారి మాత్రమే.. రుణ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని