స్టాక్ మార్కెట్లలో భారీగా పెరిగిన రిటైల్ భాగస్వామ్యం! - People invested in stock maret during lockdown
close

Published : 22/06/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్ మార్కెట్లలో భారీగా పెరిగిన రిటైల్ భాగస్వామ్యం!

ముంబయి: భారతీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ భాగస్వామ్యం పెరుగుతోందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో కొత్తగా 44.7 లక్షల రిటైల్ పెట్టుబడిదారుల ఖాతాలు ప్రారంభమైనట్లు తెలిపింది. మార్కెట్లో వ్యక్తిగత పెట్టుబడిదారుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 142 లక్షలు పెరిగిందని పేర్కొంది. వీటిలో సీడీఎస్‌ఎల్‌లో 122.5 లక్షల కొత్త ఖాతాలు కాగా, ఎన్‌ఎస్‌డీఎల్‌లో 19.7 లక్షల ఖాతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే, ఎన్‌ఎస్‌ఈ సమాచారం ప్రకారం.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మొత్తం టర్నోవర్‌లో వ్యక్తిగత పెట్టుబడిదారుల వాటా మార్చి, 2020 నాటికి 39 శాతం నుంచి 45 శాతానికి పెరిగింది.

మహమ్మారి కట్టడి నిమిత్తం విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబపరమైన పొదుపులు గణనీయంగా పెరిగినట్లు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. రెండో త్రైమాసికంలోనూ పొదుపుల విషయంలో నియంత్రణ కొనసాగిందని పేర్కొంది. కానీ, మూడు, నాలుగు త్రైమాసికాల్లో మాత్రం కరెన్సీ తిరిగి భారీ ఎత్తున చెలామణిలోకి వచ్చినట్లు తెలిపింది. నగదు చెలామణి మూడో త్రైమాసికంలో రూ.80,501 కోట్లు, నాలుగో త్రైమాసికంలో రూ.95,181 కోట్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అదే తొలి త్రైమాసికంలో ఇది రూ.17,225 కోట్లుగానే ఉన్నట్లు తెలిపింది.

స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపర్ల ఆసక్తికి నివేదిక పేర్కొన్న పలు ప్రధాన కారణాలు...

* రెపో రేటు 4 శాతంగా కొనసాగుతుండడంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, సుకన్యసమృద్ధి యోజన, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్ స్కీమ్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్ సర్టిఫికెట్‌ సహా పొదుపు ఖాతా ద్వారా లభించే వడ్డీ తగ్గిపోయింది. దీంతో ప్రజలు స్టాక్‌ మార్కెట్లపై ఆసక్తి పెంచుకున్నారు.

* అంతర్జాతీయంగా నగదు లభ్యత గణనీయంగా పెరగడం కూడా స్టాక్ మార్కెట్లలో రిటైల్‌ పెట్టుబడిదారులకు ఆసక్తికి మరో కారణం. గత ఆర్థిక సంవత్సరం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా 36.18 బిలియన్‌ డాలర్లను భారత మార్కెట్లోకి తరలించారు.

అలాగే ఇళ్లలో గడిపేందుకు ప్రజలకు అధిక సమయం లభించడం కూడా స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణమని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.

గత ఏడాది వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల మార్కెట్ విలువలో గణనీయమైన పెరుగుదల నమోదయింది. భారత్‌లో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. బీఎస్‌ఈ-సెన్సెక్స్‌ మార్కెట్ విలువ గత ఏడాది కాలంలో 1.8 రెట్లు పెరిగింది. రష్యా స్టాక్‌ మార్కెట్ల విలువ 1.6 రెట్లు ఎగబాకింది. తరువాతి స్థానంలో బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని