మహమ్మారి కాలంలోనూ ఫార్మా దూకుడు - Pharma is leading even in pandemic
close

Updated : 18/04/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహమ్మారి కాలంలోనూ ఫార్మా దూకుడు

 2020-21లో 24.44 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు
 18.07శాతం వృద్ధి

 మార్చిలోనే 2.3 బిలియన్‌ డాలర్లు
ఈనాడు - హైదరాబాద్‌

నదేశం నుంచి గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో  24.44 బిలియన్‌ డాలర్ల (రూ.1,82,176 కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు 20.58 బిలియన్‌ డాలర్లు మాత్రమే. దీని ప్రకారం చూస్తే ఔషధ ఎగుమతుల్లో 18.07 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎగుమతుల వివరాలను ఫార్మాసూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో రికార్డు స్థాయిలో 2.3 బిలియన్‌ డాలర్ల మందులు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలోనూ ఈ స్థాయిలో మందుల ఎగుమతులు జరగలేదు. క్రితం ఏడాది మార్చి నెలలో 1.54 బిలియన్‌ డాలర్ల మందులే ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19 మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌, ముడి పదార్థాల కొరత, సరఫరా సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేశీయ ఔషధ పరిశ్రమ అధిక ఎగుమతులు సాధించింది.
ఉత్తర అమెరికా వాటా అధికం
* మనదేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికాకు అధికంగా ఔషధ ఎగుమతులు జరిగాయి. ఎగుమతుల్లో ఉత్తర అమెరికా వాటా 34 శాతం ఉంది. యూఎస్‌ఏ, కెనడా, మెక్సికో ఎగుమతులు వరుసగా... 12.6%, 30%, 21.4% పెరిగాయి.
* ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు 13.4% అధికంగా నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా ఎగుమతులు 28% పెరగటం గమనార్హం.
* ఐరోపా ఎగుమతులు 11% పెరిగాయి.
* లాటిన్‌ అమెరికా, సీఐఎస్‌, మధ్య ప్రాచ్య దేశాల నుంచి భారతీయ ఔషధాలకు డిమాండ్‌ పెరిగింది.
* గతంలో పెద్దగా మనవైపు చూడని ఆస్ట్రేలియా, యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌, ఉక్రెయిన్‌ దేశాలు ఇటీవల మన నుంచి అధికంగా మందులు కొనుగోలు చేశాయి. 

వృద్ధి బాట కొనసాగిస్తాం...

‘గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి 2020-21 ఆర్థిక సంవత్సరం ఔషధ ఎగుమతుల్లో కనిపించింది. ఇదే వృద్ధి మున్ముందూ కొనసాగుతుంది. వచ్చే కొన్నేళ్లలో మనదేశం నుంచి టీకాలు భారీగా ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎల్‌ఐ స్కీము వల్ల ముడిఔషధాల కొరత పరిష్కారమై జనరిక్‌ ఔషధాలను ఇంకా అధికంగా ఎగుమతి చేయగలుగుతాం. గత ఏడాది కాలంగా ఫార్మాగ్జిల్‌ వర్చువల్‌ పద్దతిలో వ్యాపార సమావేశాలు నిర్వహించి ఎగుమతులు పెరగటానికి కృషి చేసింది. మనదేశం నుంచి ఐటీ తర్వాత అత్యధికంగా ఎగుమతులు నమోదు చేస్తున్నది ఔషధ రంగమే’

- ఆర్‌.ఉదయ భాస్కర్‌, ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని