అవాంఛిత వాణిజ్య కాల్స్‌ అరికట్టండి - Prevent unwanted commercial calls Delhi High Court reference to Troy
close

Published : 04/02/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవాంఛిత వాణిజ్య కాల్స్‌ అరికట్టండి

 ట్రాయ్‌కి దిల్లీ హైకోర్టు సూచన

దిల్లీ: అవాంఛిత వాణిజ్య కాల్స్‌ను (యూసీసీ) అరికట్టేందుకు 2018లో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తీసుకొచ్చిన టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్సెస్‌ రెగ్యులేషన్స్‌ను (టీసీసీసీపీఆర్‌) కచ్చితంగా అమలు చేయాల్సిందిగా దిల్లీ హైకోర్టు సూచించింది. ఈ నిబంధనలు పాటించాలంటూ టెలికాం సేవల ప్రొవైడర్లు (టీఎస్‌పీలు) బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు హైకోర్టు మార్గనిర్దేశం చేసింది. టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్‌ నెట్‌వర్క్‌లపై ‘ఫిషింగ్‌’ కార్యకలాపాలను బ్లాక్‌ చేయడం లేదని ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎమ్‌ను నిర్వహిస్తున్న ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీన్ని విచారించిన చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఫిషింగ్‌ అనేది సైబర్‌ నేరం కిందకు వస్తుంది. కొంత మంది ఇ-మెయిల్‌, ఫోన్‌ కాల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్‌ల ద్వారా తాము ఒక సంస్థకు చెందిన చట్టబద్ధమైన ప్రతినిధిగా చెప్పుకొంటూ వారి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లను చాకచక్యంగా లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాణిజ్య కాల్స్‌ను టెలికాం ఆపరేటర్లు నియంత్రించాలని తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్‌కు సూచించింది.
జనవరిలో సేవల రంగ పీఎంఐ 52.8  
దిల్లీ: దేశీయ గిరాకీతో భారత సేవల రంగం వరుసగా నాలుగో నెలా వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో సేవల రంగ వ్యాపార కార్యకలాపాల సూచీ 52.8 పాయింట్లుగా నమోదైంది. ఇది డిసెంబరులో 52.3 పాయింట్లుగా ఉంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన ఉంటే క్షీణతగా భావించాల్సి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం, పెరుగుతున్న వ్యాపార ఆశావాదం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి దోహదం చేశాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సర్వే వెల్లడించింది. ‘భారత సేవల రంగంలో కార్యకలాపాలు మంచి స్థాయికి చేరాయి. కొత్త వ్యాపార పరిమాణాలు వరుసగా నాలుగో నెలా వృద్ధి నమోదు చేశాయ’ని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలియానా డె లీమా వెల్లడించారు.
ఎన్‌బీఎఫ్‌సీలూ ఆడిట్‌ ఇలా చేయండి
* మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ

ముంబయి: ఎంపిక చేసిన బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు, పట్టణ సహకార బ్యాంకులకు నష్టభయ ఆధారిత అంతర్గత ఆడిట్‌(ఆర్‌బీఐఏ) వ్యవస్థను ఆర్‌బీఐ ఆవిష్కరించింది. వీటి అంతర్గత ఆడిట్‌ వ్యవస్థ నాణ్యతను, ప్రభావాన్ని పెంచడం కోసమే దీనిని తీసుకొస్తున్నట్లు వివరించింది.
రూ.5,000 కోట్లకు పైగా ఆస్తుల పరిమాణం ఉండి, డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు ఇది వర్తిస్తుంది. రూ.500 కోట్లకు పైగా ఆస్తులుండే పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)లు కూడా ఈ కొత్త వ్యవస్థకు మారాల్సి ఉంటుందని ఆర్‌బీఐ బుధవారం తెలిపింది. ప్రస్తుతం ఆర్‌బీఐ పర్యవేక్షణలో ఉన్న అన్ని సంస్థలు అంతర్గత ఆడిట్‌ విషయంలో సొంత విధానాలు పాటిస్తుండడంతో.. వ్యవస్థలో కొన్ని అస్థిరతలు, నష్టభయాలు, అంతరాలను తెస్తున్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఈ సంస్థలన్నీ మార్చి 31, 2022 కల్లా ఆర్‌బీఐఏ వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుంది.

బెకాన్స్‌ ఇండస్ట్రీస్‌పై సెబీ రూ.11.8 కోట్ల జరిమానా
దిల్లీ: బెకాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, అందులో పని చేస్తున్న నలుగురు అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.11.8 కోట్ల జరిమానా విధించింది. గ్లోబల్‌ డిపాజిటరీ రిసిప్ట్స్‌ (జీడీఆర్‌లు) జారీలో అవకతవకలకు పాల్పడ్డారని తేలడంతో ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బెకాన్స్‌ 2008 జులైలో 50 లక్షల డాలర్ల విలువైన జీడీఆర్‌లను జారీ చేసింది. యూఏఈలో అనుబంధ సంస్థ నెలకొల్పాలనే ఉద్దేశంతో అప్పట్లో ఈ జీడీఆర్‌లను జారీ చేసింది. సెబీ దర్యాప్తులో వింటేజ్‌ ఎఫ్‌జెడ్‌ఈ ఒక్కటే ఈ జీడీఆర్‌లను కొనుగోలు చేసినట్లు తేలింది. వింటేజ్‌ నుంచి తీసుకున్న రుణానికి ఈ జీడీఆర్‌లను తనఖాగా పెట్టింది. ఈ జీడీఆర్‌లను లగ్జెంబర్గ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్‌ చేసిన విషయాన్ని కూడా బీఎస్‌ఈకి తెలపడంలో బెకాన్స్‌ విఫలమైందని సెబీ తేల్చింది. మోసపూరితంగా ఈ జీడీఆర్‌లను జారీ చేసినట్లుగా గుర్తించి బెకాన్స్‌ ఇండస్ట్రీస్‌, నలుగురు అధికారులపై తాజాగా జరిమానా విధించింది.
అంతర్జాతీయ బాండ్ల సూచీల్లో భారత సార్వభౌమ బాండ్ల నమోదు!
* ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌

దిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో భారత సార్వభౌమ బాండ్లను (జీ-సెక్‌లు) అంతర్జాతీయ బాండ్ల సూచీల్లో చేర్చేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కలిసి పని చేస్తున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు. ఇది సాకారమైతే విదేశీ నిధులను భారీ స్థాయిలో ఆకర్షించే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశీ ఫండ్‌ సంస్థలు ఎక్కువగా అంతర్జాతీయ సూచీల్నే గమనిస్తుంటాయి. జీ-సెక్‌ల నమోదు.. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ప్యాసివ్‌ పెట్టుబడుల్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. దీని ఫలితంగా పరిశ్రమలకు ఎక్కువ మొత్తంలో మూలధనం లభిస్తుంది. ‘వీలైతే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలోనే ప్రభుత్వ బాండ్ల నమోదుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ కుదరకపోతే రెండో అర్ధ భాగంలో నమోదు చేసే అవకాశం ఉంద’ని తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని