ఆటోమేటిక్‌ చెల్లింపులపై ఊరట - RBI Extends deadline of additional authentication for auto payments till sep 30
close

Published : 31/03/2021 16:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆటోమేటిక్‌ చెల్లింపులపై ఊరట

సెప్టెంబరు 30 వరకు గడువు కల్పించిన ఆర్‌బీఐ

దిల్లీ: రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్‌, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్‌ రికరింగ్‌ చెల్లింపులపై వినియోగదారులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఊరట కల్పించింది. ఆటోమేటిక్‌ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. 

ఆటోమేటిక్‌ రికరింగ్‌ చెల్లింపులకు వినియోగదారుల నుంచి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31 తర్వాత ఏఎఫ్‌ఏ(అడిషినల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌)కు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్‌ఆర్‌బీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ గేట్‌వేలతో పాటు బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ గతేడాది డిసెంబరు 4న ఆదేశించింది. కార్డు లావాదేవీల భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ గతంలో తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం రికరింగ్‌ ఆటోమేటిక్‌ చెల్లింపుల మొత్తం రూ. 5000 దాటితే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ గేట్‌వేల చెల్లింపుదారులకు ఓటీపీ పంపి వారి ఆమోదం తీసుకున్నాకే లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ చెల్లింపులను అనుమతించరు. అంతకుముందు రూ. 2000 మించి చేసే అన్ని లావాదేవీలకు దీన్ని పరిమితం చేయాలని ఆర్‌బీఐ భావించింది. అయితే ఈ పరిమితిని పెంచాలని విజ్ఞప్తులు రావడంతో రూ. 5000 మించిన చెల్లింపులకు ఏఎఫ్‌ఏ తప్పనిసరి చేసింది. 

అయితే కొత్త మార్గదర్శకాలను అమలు చేసేందుకు కొంత సమయం కావాలని బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వే సంస్థలు కేంద్ర బ్యాంకును కోరాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ సెప్టెంబరు 30 వరకు గడువు కల్పించింది. అప్పటివరకు ఆటోమేటిక్‌ చెల్లింపులు యథావిధిగా కొనసాగనున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని