Rakesh Jhunjhunwala: బోయింగ్‌కు బూస్ట్‌ ఇవ్వనున్న బిగ్‌బుల్‌? - Rakesh Jhunjhunwala airline may give Boost to Boeing
close

Published : 31/07/2021 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rakesh Jhunjhunwala: బోయింగ్‌కు బూస్ట్‌ ఇవ్వనున్న బిగ్‌బుల్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ భారత్‌లో క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మన దేశంలోని రెండు కీలక క్లయింట్‌లలో ఒకటైన జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడమే అందుకు కారణం. అయితే, బిగ్‌బుల్‌గా పేరుగాంచిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా విమానయాన రంగంలోకి రానుండడంతో బోయింగ్‌కు తిరిగి పూర్వవైభవం రానుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇండిగో, డెల్టా విమానయాన సంస్థలకు చెందిన మాజీ సీఈఓలతో కలిసి ‘ఆకాశ ఎయిర్‌’ పేరిట ఝున్‌ఝున్‌వాలా ఓ ఎయిర్‌లైన్‌ను స్థాపించనున్న విషయం తెలిసిందే. భారత్‌లో దేశీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. తక్కువ ధరలో సామాన్య ప్రజలకు విమాన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న 70 విమానాలను సమకూర్చుకోనున్నామన్నారు. భారత్‌లో విమానయాన రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ప్రవేశిస్తుండడం గమనార్హం.

అయితే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా దీర్ఘకాలిక ప్రణాళికలు విమాన తయారీ సంస్థలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌కు భారత్‌లో మంచి అవకాశాలు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బోయింగ్‌ తయారు చేసిన 737 విమానానికి భారత్‌లో స్పైస్‌ జెట్‌ మినహా మరో క్లయింట్‌ లేదు. దీంతో ఈ మోడల్‌ను విక్రయించేందుకు ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు.

భారత్‌లో స్పైస్‌జెట్‌, ఇండిగో, గోఫస్ట్‌, ఎయిర్‌ఏషియా ఇండియాకు చెందిన విమానాల్లో ఎక్కువ శాతం తక్కువ పరిమాణం గల ‘లో కాస్ట్‌ క్యారియర్లే(ఎల్‌సీసీ)’. ఇవన్నీ ఎయిర్‌బస్‌కు చెందినవే. పెద్ద పరిమాణం విభాగంలో బోయింగ్‌ది ఆధిపత్యం. ఈ కేటగిరీలో బోయింగ్‌కు చెందినవి భారత్‌లో 51 విమానాలు ఉన్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడ్డ తర్వాత ఎస్‌సీసీ విభాగంలో బోయింగ్‌ వాటా 18 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఆకాశ ఎయిర్‌’కు విమానాలు అందించడం ద్వారా బోయింగ్‌ తిరిగి భారత్‌లో తన పునర్‌వైభవాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని