ప్లీజ్‌.. ‘భారతరత్న’ ప్రచారం ఆపండి: టాటా - Ratan Tata Request to stop campaign on Bharat Ratna
close

Updated : 06/02/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లీజ్‌.. ‘భారతరత్న’ ప్రచారం ఆపండి: టాటా

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన టాటా.. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు. అసలేం జరిగిందంటే..

డాక్టర్‌ వివేక్‌ భింద్రా అనే ఓ మోటివేషనల్‌ స్పీకర్‌ శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో రతన్‌ టాటా గురించి ఓ ట్వీట్‌ చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ టాటాకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. అందుకోసం తమ #BharatRatnaForRatanTata ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రతన్‌టాటా భారత రత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. 

తాజాగా ఈ ప్రచారంపై రతన్‌ టాటా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నాకు అవార్డు ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. అయితే ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని వారిని సవినయంగా కోరుతున్నా. వీటన్నంటికంటే నేను భారతీయుడిని అవడం.. దేశ వృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను’’ అని టాటా తెలిపారు. 

పారిశ్రామికవేత్త, దాతగా కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న రతన్‌ టాటా.. దేశంలో కరోనా విజృంభించిన సమయంలో రూ. 1500కోట్ల విరాళాలు ప్రకటించి తన పెద్దమనసు చాటుకున్నారు. ఆయన సేవలకుగానూ కేంద్రం 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కరాలతో సత్కరించింది.

ఇదీ చదవండి..

చెప్పులేసుకుంటే.. లక్షల్లో జీతంమరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని