6 నెలల్లో మూడింతలైన ‘రేజర్‌ పే’ విలువ! - Razor pay value triple in just 6 months
close

Published : 19/04/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 నెలల్లో మూడింతలైన ‘రేజర్‌ పే’ విలువ!

బెంగళూరు: అక్టోబర్‌లో యూనికార్న్‌(బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన సంస్థ)గా అవతరించిన ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే సంస్థ ‘రేజర్‌ పే’లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మరో 160 మిలియన్ డాలర్ల నిధులు సంస్థలో చేరాయి. దీంతో ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలో సంస్థ విలువ మూడింతలై మూడు బిలియన్లకు చేరుకుంది. ఈసారి నిధులు సమకూర్చిన కంపెనీల్లో జీఐసీ, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌, సెఖోయా ఇండియా, రిబిట్‌ క్యాపిటల్‌, మాట్రిక్స్‌ పార్టనర్స్‌ ఉన్నాయి.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘రేజర్‌ పే’ వివిధ వ్యాపార సంస్థల మధ్య అవసరమయ్యే ఆర్థిక సేవలు అందిస్తుంటుంది. బిల్‌డెస్క్‌, పేయూ, పేటీఎం వంటి వాటి నుంచి ఇది పోటీ ఎదుర్కొంటోంది. తాజా పెట్టుబడులతో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు హర్షిల్‌ మాథుర్‌ తెలిపారు. ఈ క్రమంలో సంస్థ సేవల్ని ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. అలాగే కొన్ని సంస్థల్ని కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన నియో బ్యాంకింగ్‌, లెండింగ్‌ సేవలకు భారీ ఆదరణ లభించిందని.. వీటిని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు. నియో బ్యాంక్‌ లావాదేవీలు 400 శాతం పెరిగాయని పేర్కొన్నారు. నగదు నిర్వహణలో వ్యాపారాలకు రేజర్‌పేఎక్స్‌, క్యాపిటల్‌ వంటి ఉత్పత్తులతో మెరుగైన సేవలందించామన్నారు. రేజర్‌పేఎక్స్‌తో దాదాపు 15,000 మంది వ్యాపారులు లబ్ధిపొందుతున్నారన్నారు. 

కొవిడ్‌ నేపథ్యంలో రేజర్‌పేఎక్స్‌ వినియోగానికి డిమాండ్‌ పెరిగిందని హర్షిత్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం అందించగలిగే మరిన్ని ప్రత్యేక సాధనాలను అందించేందుకు కొన్ని నిధులను వెచ్చిస్తామని వెల్లడించారు. క్రెడ్‌, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌, డంజో వంటి సంస్థలు తమ వినియోగదారులకు రీఫండ్లు, పేఔట్లకు రేజర్‌పేఎక్స్‌నే వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రతినెలా కంపెనీ రూ.700 కోట్ల వరకు రుణాలు అందిస్తోందని వెల్లడించారు. ఇది కంపెనీల మూలధన అవసరాలను తీరుస్తోందన్నారు. దీన్ని రూ.10,00 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఆరు నెలల్లో రేజర్‌పే 40-45 శాతం వృద్ధి సాధించింది. 2021 చివరి నాటికి సంస్థ మొత్తం పేమెంట్‌ వాల్యూమ్‌ 40 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని