బీమా పాలసీలకు కరోనా దెబ్బ - Recovered people find higher exclusions rise in insurance denials
close

Updated : 21/04/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీమా పాలసీలకు కరోనా దెబ్బ

వైరస్‌ నుంచి కోలుకున్నా వెనకాడుతున్న బీమా సంస్థలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రకాశ్‌.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ముంబయిలో ఓ మీటింగ్‌కు వెళ్లడంతో గత ఫిబ్రవరిలో కరోనా సోకింది.  కొన్ని రోజుల్లో నయమైపోయింది. మార్చిలో ఆతడికి వివాహమైంది. తనకంటూ ఓ కుటుంబం ఏర్పడంతో భరోసా కోసం ఓ టర్మ్‌ పాలసీ తీసుకుందామని బీమా సంస్థకు వెళ్లాడు. కానీ, వాళ్ల మాట విని ఆశ్చర్యపోయాడు. ‘ఇప్పుడు పాలసీ ఇవ్వలేము.. తొమ్మిది నెలలు ఆగిన తర్వాత రండి’  ఇదీ వారి సమాధానం. నిజానికి ఏ బీమా సంస్థలైనా పాలసీ తీసుకుంటామంటే.. పరుగెత్తుకుంటూ వస్తాయి. అలాంటిది కరోనా మహమ్మారి పరిస్థితులను తలకిందులు చేసేసింది.

‘‘నేను పాలసీ ఇప్పుడే తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత రమ్మనడం ఏంటి. కరోనా నుంచి కోలుకుంటున్నట్లు, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు ఇచ్చిన ధ్రువపత్రాలు ఉన్నాయి.పాలసీ ఇవ్వడానికి మీకు సమస్య ఏంటి’’ అని ప్రకాశ్‌ ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. ఇది కేవలం ప్రకాశ్‌ సమస్య మాత్రమే కాదు.. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత బీమా పాలసీ తీసుకోవడానికి వెళ్లిన చాలా మందికి ఈ సమస్య ఎదురవుతోంది. మరోవైపు బీమా సంస్థలను కూడా తప్పుపట్టలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 9,80,000 మంది తమ ఇన్సూరెన్స్‌లను క్లెయిమ్‌ చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.14 వేల కోట్లకు పైమాటే ఉండటం గమనార్హం. మరోవైపు కరోనా విలయం తర్వాత టర్మ్‌ పాలసీలు తీసుకునే వారు అనూహ్యంగా పెరిగిపోయారు. గతంలో కంటే పాలసీలు తీసుకున్న వారి సంఖ్య 25 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.

టర్మ్‌ పాలసీల మాట అటుంచింతే ఆరోగ్య బీమా విషయంలోనూ సంస్థలు లేనిపోని షరతులు విధిస్తున్నాయి.దీనికో ఉదాహరణను పరిశీలిద్దాం. శ్యామల ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. సంస్థ ఆమెకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తోంది. అయితే అది సరిపోదనే ఉద్దేశంతో మరికొంత మొత్తానికి బీమా తీసుకోవాలని ఓ సంస్థను ఆశ్రయించారు. అయితే అంతకుముందే ఆమె కరోనా నుంచి కోలువడంతో పాలసీ ఇచ్చేందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఒకవేళ ఇచ్చినా ఏడాది పూర్తయ్యే వరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అందులో కవర్‌ కాబోవని తేల్చి చెప్పేసింది. ‘ కొవిడ్‌ పూర్తిగా నయమైంది. దానికి సంబంధించిన పత్రాలు కూడా తీసుకొస్తాను ’ అని చెప్పినా ఫలితం లేకపోయింది. కరోనాను సాకుగా చూపించి..కొన్ని సంస్థలు ప్రీమియం మొత్తాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ ప్రీమియం కంటే దాదాపు 35 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి.

కారణాలేంటి?

కొవిడ్‌ బాధితులు వైరస్‌ నుంచి కోలుకుంటున్నప్పటికీ వారిలో అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తోంది. కండరాల బలహీనత, ఊపిరితిత్తులు సరిగా పని చేయకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.  అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పాలసీలు ఇచ్చేందుకు.. అందులోనూ కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో బీమా సంస్థలు మరింత వెనకడుగు వేస్తున్నాయి. క్లెయిమ్‌ల సంఖ్య పెరిగితే సంస్థలు మూత పడే అవకాశముందని, అందువల్ల ముందుజాగ్రత్తగా ఇలాంటి చర్యలు తప్పడం లేదని చెబుతున్నాయి.

దీనికి మార్గమే లేదా?

పాలసీలు తీసుకోవడం సులభతరం కావాలంటే ముందుగా  కరోనా ఉద్ధృతి తగ్గాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. బీమా పాలసీలు తీసుకునే వారు కూడా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా ఉంటారు. వీరంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లయితే వైరస్‌ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులకు సాధారణ పరిస్థితులు ఏర్పడితే పాలసీలు తీసుకోవడం సులభమవ్వొచ్చని వారు చెబుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని