ప్చ్‌.. మళ్లీ నిరాశ - Retail inflation reaches to 3 month high
close

Published : 13/03/2021 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌.. మళ్లీ నిరాశ

3 నెలల గరిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
మైనస్‌లోకి పారిశ్రామికం

దిల్లీ

శుక్రవారం వెలువడిన రెండు స్థూల ఆర్థిక గణాంకాలూ మదుపర్లకు నిరాశ కలిగించాయి. ఫిబ్రవరిలో ఆహార ధరలు పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో సానుకూలంగా నమోదైన    పారిశ్రామికోత్పత్తి జనవరిలో మళ్లీ ప్రతికూలంలోకి వెళ్లింది.

ఆహార వస్తువుల ధరలు పెరగడంతో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మూడు నెలల గరిష్ఠమైన 5.03 శాతానికి చేరింది. జనవరిలో ఇది 4.06 శాతంగానే ఉంది. 2020 నవంబరులో ఇది 6.93 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఆహార ధరలు 3.87 శాతం మేర పెరిగాయి. జనవరిలో ఇవి 1.89 శాతం మాత్రమే పెరిగినట్లు ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. జనవరిలో ఇంధన ద్రవ్యోల్బణం 3.87 శాతంగా నమోదు కాగా.. ఫిబ్రవరిలో 3.53 శాతం పెరిగింది. ‘నూనెలు-కొవ్వులు’ ధరలు కూడా 19.71 శాతం నుంచి 20.78 శాతానికి పెరిగాయి. పళ్లు 6.28 శాతం మేర ప్రియమయ్యాయి. కూరగాయల ధర జనవరిలో 15.84 శాతం తగ్గితే, ఫిబ్రవరిలో 6.27 శాతం మేర ధరలు తగ్గాయి. పాలు-పాల ఉత్పత్తులు, పప్పులు-పప్పు ఉత్పత్తులు, గుడ్ల ధరలు వరుసగా 2.59%, 12.54%, 11.13% మేర పెరిగాయి. జనవరిలో వీటి ద్రవ్యోల్బణం 2.73%, 13.39%, 12.85 శాతంగా నమోదయింది.


ఐఐపీ..ప్రతికూలంలోకి

పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మళ్లీ క్షీణించింది. యంత్ర పరికరాలు, తయారీ, గనుల తవ్వక రంగాల్లో ఉత్పత్తి తగ్గడంతో జనవరిలో ఈ సూచీ  1.6 శాతం మేర డీలా పడింది. 2020 డిసెంబరు ఐఐపీ గణాంకాలను 1 శాతం నుంచి 1.56 శాతానికి సవరిస్తున్నట్లు జాతీయ గణక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. 2020 సెప్టెంబరు, అక్టోబరులో రాణించిన ఐఐపీ.. నవంబరు  లో ప్రతికూలంలోకి వెళ్లింది. డిసెంబరులో సానుకూలంగా మారినా, మళ్లీ 2021 జనవరిలో క్షీణించింది. లాక్‌డౌన్, తదుపరి కాలంలో తగ్గిన తమ పొదుపు మొత్తాలను పెంచుకునేందుకు కొందరు  గృహస్థులు  ప్రయత్నిస్తున్నందునే, వినియోగం పుంజుకోవడంలో ఊగిసలాట కనిపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐఐపీలో 77.6 శాతం ఉండే తయారీ రంగం జనవరిలో 2 శాతం తగ్గింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 1.8 శాతం వృద్ధి చెందింది. యంత్ర పరికరాలు కిందటి జనవరిలో 4.4 శాతం తగ్గగా.. ఈ సారి 9.6 శాతం దిగాలు పడింది. గనుల రంగం కూడా 4.4 శాతం వృద్ధి నుంచి 3.7 శాతం క్షీణతకు చేరింది.

ఏప్రిల్‌-జనవరిలో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరిలో ఐఐపీ 12.2 శాతం మేర క్షీణించింది. 2019-20 ఇదే సమయంలో 0.5 శాతం మేర వృద్ధి నమోదు చేయడం గమనార్హం.


 

భారత్‌ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించింది

అయిదేళ్ల ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరడంలో ఆర్‌బీఐ విజయం సాధించిందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(బీఓఎఫ్‌ఏ) సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. 2016 అక్టోబరు -2020మార్చిలో సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.9 శాతంగా నమోదైందని.. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతంలోపే ఇది ఉందని వివరించింది. తొలిసారిగా పరపతి విధాన వ్యవస్థను ఆర్‌బీఐ త్వరలో సమీక్షించబోతున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడడం విశేషం. ఆర్‌బీఐ గవర్నర్‌ ఆధ్వర్యంలోని పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్బణ లక్ష్యాలను సవరించనుంది. ద్రవ్యోల్బణ ఊగిసలాట కూడా అక్టోబరు 2016- మార్చి 2020 మధ్య 1.4 శాతానికే పరిమితం కావడం విశేషమని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 2012-16లో ఇది 2.4 శాతంగా ఉంది. 2021-22లో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. 2020-21లో నమోదవుతుందని భావిస్తున్న 6.2 శాతంతో పోలిస్తే తక్కువే.

ఇవీ చదవండి...

సంపద సృష్టిలో సరిలేరు మరెవ్వరూ

17 నుంచి నజారా టెక్నాలజీస్‌ ఐపీఓ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని