లండన్‌లో క్లౌడ్‌టెయిల్‌ ఇండియాపై రూ.56 కోట్ల పన్ను డిమాండ్‌ - Rs 56 crore tax demand on CloudTail India in London
close

Updated : 15/06/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లండన్‌లో క్లౌడ్‌టెయిల్‌ ఇండియాపై రూ.56 కోట్ల పన్ను డిమాండ్‌

వివాదంలోకి నారాయణమూర్తి సంస్థ

లండన్‌: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి చెందిన కాటమరాన్‌ వెంచర్స్‌, అమెజాన్‌ డాట్‌ కామ్‌ల ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ సంయుక్త సంస్థ క్లౌడ్‌టెయిల్‌ ఇండియా ప్రై.లి. 55 లక్షల పౌండ్ల (సుబారు రూ.56 కోట్లు) పన్ను డిమాండ్‌ను (వడ్డీ, అపరాధ రుసుములతో కలిపి) అధికారుల నుంచి ఎదుర్కొంటున్నట్లు ‘ది గార్డియన్‌’ వార్తాపత్రిక వెల్లడించింది. అమెజాన్‌ స్వతంత్ర విక్రేతలను అభివృద్ధి చేస్తూనే, క్లౌడ్‌టెయిల్‌ను ‘స్పెషల్‌ మర్చంట్‌’గా తీసుకొచ్చింది. ఇది 2019 వరకు మొత్తం విక్రయాల్లో 35 శాతం వాటా సాధించుకుంది. క్లౌడ్‌టెయిల్‌లో కాటమరాన్‌ వెంచర్స్‌కు 76 శాతం వాటా ఉండగా, అమెజాన్‌కు మిగతా 24 శాతం వాటా ఉంది. నాలుగేళ్లుగా ఈ సంస్థ పన్నును తక్కువగా చూపించి చెల్లింపులు చేసినట్లు గుర్తించిన పన్ను అధికారులు, తాజాగా పన్ను డిమాండ్‌ నోటీస్‌ను పంపినట్లు తెలుస్తోంది. మాకున్న మొత్తం 8.5 లక్షల మంది విక్రేతల్లో క్లౌడ్‌టెయిల్‌ కూడా ఒకటని, అమెజాన్‌ ఉద్యోగులు ఎవరూ క్లౌడ్‌టెయిల్‌తో కలిసి పని చేయడం లేదని అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. టెక్నాలజీ కంపెనీలు అధిక పన్ను చెల్లించేలా తీర్మానం చేసిన జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశానికి నారాయణమూర్తి అల్లుడు రిషి నేతృత్వం వహించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


పిల్‌ ఇటాలికా పంపిణీ కేంద్రం హైదరాబాద్‌లో

ఈనాడు, హైదరాబాద్‌: ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్లు, ట్రాలీలు, సామాగ్రిని భద్రపర్చుకునే డబ్బాలు, చెత్త డబ్బాల్లాంటివి ఉత్పత్తి చేసే పిల్‌ ఇటాలికా దక్షిణాది రాష్ట్రాల్లోకి అడుగు పెట్టనుంది. మొత్తం అయిదు రాష్ట్రాల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం, సంస్థలను స్వాధీనం చేసుకోవడం, లీజుకు తీసుకోవడం ద్వారా విస్తరించాలన్నది ప్రణాళికగా సంస్థ తెలిపింది. వార్షిక ఉత్పతి సామర్థ్యం 3,600 మెట్రిక్‌ టన్నులకు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ విస్తరణ చేపడుతున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌, చెన్నైలలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థకు బెంగళూరులో పంపిణీ కేంద్రం ఉంది. అయిదేళ్లకు సంబంధించిన విస్తరణ ప్రణాళికలు ప్రకటించేందుకు ఈ నెల 24న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తామని ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.  


సంక్షిప్తంగా..

* పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది.
* పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 7 కోట్ల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసేందుకు కార్లైల్‌ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ చేసింది.
* కొవిడ్‌-19 సవాళ్లున్నా గత 15 నెలల్లో సుమారు రూ.1,219 కోట్ల రుణాలను తిరిగి చెల్లించామని రట్టన్‌ఇండియా పవర్‌ వెల్లడించింది.
* గ్రీన్‌ ప్రోడక్ట్‌ శ్రేణిలో ఉత్పత్తుల్ని విడుదల చేయడం ద్వారా నిర్మాణరంగ రసాయనాల వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ వెల్లడించింది.
* ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు గత నెలలో 3.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27,000 కోట్లు)కు పరిమితమైనట్లు ఈవై నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో ఇవి 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని