పాక్షిక లాక్‌డౌన్‌తో రూ.1.5 లక్షల కోట్ల నష్టం - SBI slashes growth forecast
close

Published : 24/04/2021 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్షిక లాక్‌డౌన్‌తో రూ.1.5 లక్షల కోట్ల నష్టం

2021-22 వృద్ధి 10.4 శాతమే ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక 

ముంబయి: కొవిడ్‌-19 కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలు మించిన నేపథ్యంలో, వ్యాప్తిని తగ్గించేందుకు కొన్ని రాష్ట్రాలు పాక్షిక లేదా వారాంతపు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ తరహా ఆంక్షలతోనూ దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) వృద్ధి అంచనాలను 11 శాతం నుంచి 10.4 శాతానికి తగ్గించింది. కొవిడ్‌-19 కేసుల పరంగా ప్రపంచంలోనే మొదటిస్థానంలో భారత్‌ ఉండటం గమనార్హం. అయినా కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం కంటే ప్రజలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేస్తేనే ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది. టీకాలకు అయ్యే మొత్తం ఖర్చు జీడీపీ విలువలో 0.1 శాతం అని, లాక్‌డౌన్‌ల కారణంగా ఇప్పటికే జీడీపీపై 0.7 శాతం మేర భారం పడిందని పేర్కొంది. 

ఆ మూడు రాష్ట్రాలదే 80% నష్టం  

పాక్షిక లాక్‌డౌన్‌లతో వాటిల్లో నష్టంలో 80 శాతం వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనే ఉంటుందని ఎస్‌బీఈ నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర వాటానే 54 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ప్రజలందరికీ టీకాలు వేసే విషయంలో ఇజ్రాయెల్, బ్రిటన్, చిలీ లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌ వెనుకంజలోనే ఉందని తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో టీకాలు వేయించుకున్న వాళ్ల సంఖ్య 1.2 శాతం మాత్రమేనని పేర్కొంది.  

59 ఏళ్ల కనిష్ఠానికి రుణ వృద్ధి 

గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ఠ స్థాయి అయిన 5.56 శాతానికి చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన విశ్లేషణలో పేర్కొంది. కరోనా సమయంలో రుణాలకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించినా.. ఫలితం కనిపించలేదు. 2020-21లో రూ.109.51 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. 2019-20లో రుణ వృద్ధి 6.14 శాతం, 58 ఏళ్ల కనిష్ఠ స్థాయి అయితే, అంతకన్నా తక్కువగా గత ఆర్థిక సంవత్సరం నమోదైంది. 1961-62లో రుణ వృద్ధి 5.38 శాతమే.జీడీపీలో 11 శాతానికి సమానమైన రూ.20 లక్షల ఉద్దీపన ప్యాకేజీలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే కరోనా ప్రభావంపై పోరాడడానికి కేటాయించారు. మిగతా మొత్తం రుణ మద్దతు కోసమే ఉపయోగించారు. అయినప్పటికీ పెద్ద ప్రభావం కనిపించలేదు. వ్యవస్థలో డిపాజిట్లు మాత్రం 11.4 శాతం వృద్ధి చెంది రూ.151.13 లక్షల కోట్లకు చేరాయి. 2019-20లో డిపాజిట్లు 7.93 శాతమే వృద్ధి చెందినట్లు ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఎస్‌బీఐ రీసెర్చ్‌ వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని