TVs Fridges Sales: టీవీలు, ఫ్రిడ్జ్‌ల అమ్మకాలు పెరగొచ్చు! - Sales of TVs and Refrigerators may go high
close

Updated : 20/09/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TVs Fridges Sales: టీవీలు, ఫ్రిడ్జ్‌ల అమ్మకాలు పెరగొచ్చు!

గృహోపకరణాల్లో రెండంకెల వృద్ధి

ఈ ఏడాదిపై కంపెనీల ఆశాభావం

దిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్‌లో రెండంకెల వృద్ధిని గృహోపకరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ముడి వస్తువుల వ్యయాలు పెరగడంతో కంపెనీలు ఈ ఏడాది రెండు సార్లు ధరలు పెంచాయి. మరో వైపు చిప్‌సెట్‌ల వంటి విడిభాగాల కొరత, కరోనా మూడోదశ ముప్పు అవకాశాలు ఉన్నప్పటికీ.. సంస్థలు అమ్మకాలపై సానుకూల వైఖరితోనే ఉన్నాయి. పెద్ద తెరల టీవీలు, ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్లు, పెద్ద ఫ్రిడ్జ్‌లు వంటి విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ పెరగొచ్చని, మంచి అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని పానసోనిక్, ఎల్‌జీ, హయర్, గోద్రేజ్‌ అప్లయెన్సెస్, లాయిడ్‌ వంటి సంస్థలు భావిస్తున్నాయి. పండుగల సీజన్‌ కోసం సరఫరా వ్యవస్థ, నిల్వలను కంపెనీలు ఇప్పటికే సిద్ధం చేశాయి. సాధారణంగా దసరా నుంచి దీపావళి మధ్య అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి.

కొత్త మోడళ్లు, ఆఫర్లతో సిద్ధం: వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఇప్పటికే పలు కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. క్యాష్‌బ్యాక్‌లు, సున్నా డౌన్‌ పేమెంట్‌తో సులభ రుణ సదుపాయం, దీర్ఘకాలిక ఈఎంఐ పథకాలను కూడా ఇస్తున్నాయి. కరోనా రెండో ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల కారణంగా భారీగా నష్టపోయిన కంపెనీలు.. తాజా పండుగల సీజన్‌లో అమ్మకాలతో పుంజుకోవాలని ఆశిస్తున్నాయి. స్మార్ట్‌ 4కే ఆండ్రాయిడ్‌ టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, ఇతర లైఫ్‌స్టైల్‌ గృహోపకరణాలకు గిరాకీ స్థిరంగా పెరుగుతోందని పానసోనిక్‌ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ మనీశ్‌ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగదారు సెంటిమెంట్‌ సానుకూలంగా ఉందని, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఎలక్ట్రానిక్‌ వస్తువులకు గిరాకీ వచ్చిందని, ఇక ఇతర వస్తువులను సైతం వినియోగదారులు అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి చూస్తున్నట్లు ఎల్‌జీ ఇండియా ఉపాధ్యక్షుడు (కార్పొరేట్‌ ప్లానింగ్‌) దీపక్‌ బన్సల్‌ అన్నారు. కరోనా రాకముందు అంటే 2019లో భారత గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ విలువ దాదాపు రూ.76,400 కోట్లు(10.93 బిలియన్‌ డాలర్లు)గా ఉండొచ్చని అంచనా.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని