ఒకే కుటుంబం.. రూ.80వేల కోట్ల వారసత్వ పన్ను! - Samsung heirs to pay nearly 11 billion dollars as inheritance tax
close

Updated : 28/04/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే కుటుంబం.. రూ.80వేల కోట్ల వారసత్వ పన్ను!

దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెల్లించనున్న శాంసంగ్‌ వారసులు

సింగపూర్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ మాజీ ఛైర్మన్‌ లీ కున్‌ హీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ పన్ను కింద అక్కడి ప్రభుత్వానికి 10.78 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.80 వేల కోట్లు) చెల్లించాలని నిర్ణయించింది. దీంతో లీ కున్‌ హీ వదిలివెళ్లిన ఆస్తుల విలువలో సగానికిపైగా వారసత్వ పన్ను రూపంలో ప్రభుత్వానికి చెందనుంది. ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తయితే.. ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్‌ వారసులు నిలుస్తారు. 

ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను రేట్లు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఇక్కడ వారసులకు ఆస్తి బదిలీ అయ్యే సమయంలో 50 శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా లీ కున్‌ హీ వారసులు చెల్లించనున్న పన్ను దక్షిణ కొరియాలో గత ఏడాది వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే నాలుగింతలు కావడం విశేషం. ఏప్రిల్‌ 2021 మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ప్రకటించారు. లీ కున్‌ హీ అక్టోబర్‌ 2020లో అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 1987లో తండ్రి లీ బ్యుంగ్‌-చుల్‌ నుంచి లీ కున్‌ హీ శాంసంగ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలోనే సంస్థ దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా రూపాంతరం చెందింది. 

డివిడెండ్లతో పాటు బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. అలాగే లీ కున్‌ హీ వదిలివెళ్లిన ఆస్తిని వారసుల మధ్య ఎలా పంచుకోనున్నారో ఆయన కుటుంబం వెల్లడించలేదు. లీ ఆస్తి విలువ 23.4 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. 

అలాగే 0.9 బిలియన్‌ డాలర్లను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతానికి ఇవ్వనున్నట్లు లీ వారసులు వెల్లడించారు. ఇక లీ సేకరించిన 23వేల అత్యంత విలువైన పెయింటింగ్‌లు, పురాతన వస్తువులను జాతీయ మ్యూజియాలకు ఇచ్చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లీ వారసుల్లో ఒకరైన జే వై లీ అవినీతి కేసులో రెండున్నరేళ్ల జైలు జీవితం గడుపుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని