Satya Nadella: నా జీవితంలో అదొక వింత ఘటన: సత్య నాదెళ్ల - Satya Nadella On Failed TikTok Deal
close

Published : 28/09/2021 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Satya Nadella: నా జీవితంలో అదొక వింత ఘటన: సత్య నాదెళ్ల

వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్‌ చేసిన విఫలయత్నంపై ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన దీనిపై స్పందించడం గమనార్హం. ‘టిక్‌ టాక్ కొనుగోలుకు తాను చేసిన ప్రయత్నం తన జీవితంలోనే వింతైన ఘటన’గా ఆయన అభివర్ణించారు. 

భద్రతా కారణాల రీత్యా భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ యాప్‌ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యాప్‌ను నిషేధిస్తామని హెచ్చరించారు. ఏదైనా అమెరికన్‌ కంపెనీకి టిక్‌టాక్‌ కార్యకలాపాలను విక్రయించాలని యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో పలు కంపెనీలు టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. అందులో మైక్రోసాఫ్ట్‌ కూడా ఒకటి. అయితే, అది చివరకు ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. పైగా టిక్‌టాక్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. అమెరికాలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

ఈ వ్యవహారంపై తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన కోడ్‌ కాన్ఫరెన్స్‌లో సత్య నాదెళ్ల మాట్లాడారు. ‘‘టిక్‌టాకే మా(మైక్రోసాఫ్ట్‌) దగ్గరకు వచ్చింది. మేం వారి వద్దకు వెళ్లలేదు. ఇరు దేశాల(అమెరికా, చైనా) సమీకరణాల మధ్య టిక్‌టాక్‌ ఇరుక్కుపోయింది. అందుకే వారు ఇతరులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలనుకున్నారు. అప్పటికే ఎక్స్‌బాక్స్‌ వీడియో గేమింగ్‌ టూల్స్‌, లింక్డిన్‌లో.. యూజర్ల భద్రతకు మేం అమలు చేస్తున్న విధానాలు బైట్‌డ్యాన్స్‌ను ఆకర్షించాయి. పైగా మా దగ్గర సమర్థమైన కోడింగ్‌ ఇంజినీర్లు ఉన్నారు. అందుకే వారు మావైపు మొగ్గుచూపారనుకుంటా. ఈ ఒప్పందం ద్వారా ఏ సాధించాలో అధ్యక్షుడు ట్రంప్‌నకు ముందే ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండేదనుకుంటా. అప్పటి ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉన్నాయని నాకు అనిపించింది. కానీ అకస్మాత్తుగా ఈ పరిణామాల నుంచి వారు కనిపించకుండా పోయారు. అసలు నమ్మలేకపోయాను. నా జీవితంలో నేను చేపట్టిన పనుల్లో ఇదే అత్యంత వింతైన ఘటన. కానీ, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది గురించి తెలిసింది’’ అని సత్య నాదెళ్ల అన్నారు. మళ్లీ టిక్‌టాక్‌ను సొంతం చేసుకునే ప్రయత్నమేమైనా చేస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇప్పుడు ఉన్న దాంతో మేం సంతృప్తిగా ఉన్నాం’ అని చమత్కరించారు. 

మరోవైపు సైబర్ భద్రత దృష్ట్యా క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. లేదంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని