SEBI: ఐపీఓ తర్వాత పెట్టుబడిని 18 నెలలు ఉంచితే చాలు - Sebi cuts lock-in period for promoters to 18 months post IPO
close

Updated : 18/08/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SEBI: ఐపీఓ తర్వాత పెట్టుబడిని 18 నెలలు ఉంచితే చాలు

ప్రమోటర్ల లాక్‌-ఇన్‌ సమయాన్ని 3 ఏళ్ల నుంచి తగ్గించిన సెబీ

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) తర్వాత ప్రమోటర్లు తమ పెట్టుబడిని కొన్ని షరతులకు లోబడి కనీసం 18 నెలల పాటు ఉంచితే (లాక్‌-ఇన్‌ పీరియడ్‌) సరిపోతుందని సెబీ తెలిపింది. ఇంతకుముందు ఇది 3 సంవత్సరాలుగా ఉండేది. ఇటీవల చాలా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కోసం లేదంటే ఫలానా ప్రాజెక్టుకు మూలధన వ్యయం మినహా ఇతరత్రా అవసరాలకు నిధులు అందించే ఉద్దేశంతో ఇష్యూకు వచ్చినప్పుడు, ప్రమోటర్లు తమ కనీస 20 శాతం పెట్టుబడిని ఐపీఓలో షేర్ల కేటాయింపు తేదీ నుంచి 18 నెలల పాటు ఉంచాలని సెబీ ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఒకవేళ కనీస పెట్టుబడి పరిమితి అయిన 20 శాతానికి మించి ప్రమోటర్లు వాటా కలిగి ఉంటే లాక్‌ ఇన్‌ పీరియడ్‌ను ప్రస్తుతమున్న సంవత్సరం కాలం నుంచి ఆరు నెలలకు తగ్గించింది. ప్రమోటర్లు కాకుండా ఐపీఓకు ముందు షేర్లను కలిగి ఉన్న వాటాదార్లకు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ను కూడా, షేర్ల కేటాయింపు తేదీ నుంచి ఆరు నెలలకు సెబీ కుదించింది. ప్రస్తుతం ఇది ఏడాదిగా ఉంది.

ఐపీఓ సమయంలో గ్రూపు కంపెనీలకు సంబంధించి వెల్లడించాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే కంపెనీ తన గ్రూపు కంపెనీల్లో అత్యుత్తమ 5 నమోదిత లేదా నమోదు కాని సంస్థల ఆర్థిక వివరాలను ఐపీఓ దరఖాస్తులో తెలియజేయడం నుంచి సెబీ మినహాయింపు ఇచ్చింది. ఇవి గ్రూప్‌ కంపెనీల వెబ్‌సైట్‌లో ఉంచితే సరిపోతుంది. అయితే ప్రభుత్వ సంస్థ లేదా చట్టబద్ద సంస్థ లేదా కార్పొరేషన్‌ లేదా ప్రత్యేక ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన సంస్థ (ఎస్‌పీవీ) మినహా ఇతర సంస్థలు తమ గ్రూపు కంపెనీల పేర్లు, వాటి రిజిస్టర్డ్‌ కార్యాలయాల చిరునామాలను ఐపీఓ దరఖాస్తు పత్రంలో పొందుపర్చాల్సి ఉంటుందని సెబీ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇందుకుగాను ఐసీడీఆర్‌ (ఇష్యూ ఆఫ్‌ కేపిటల్‌ అండ్‌ డిస్‌క్లోజర్‌ రిక్వయిర్‌మెంట్స్‌) నిబంధనలను సెబీ సవరించింది. ఈ నెల ప్రారంభంలో పై ప్రతిపాదనలకు సెబీ బోర్డు ఆమోదం తెలపడంతో తాజా నిర్ణయాలను తీసుకుంది. కంపెనీల కొనుగోలుదార్లు, ప్రమోటర్లకు సంబంధించి తప్పక వెల్లడించాల్సిన నిబంధనల నుంచి కొన్నింటిని సెబీ తొలగించింది. ఇందుకుగాను టేకోవర్‌ నిబంధనలను సవరించింది.

స్వెట్‌ ఈక్విటీ నిబంధనల సరళీకరణ
ఇన్నోవేటర్స్‌ గ్రోథ్‌ ప్లాట్‌ఫాంపై (ఐజీపీ) నమోదైన కొత్త సాంకేతిక కంపెనీలు జారీ చేసే స్వెట్‌ ఈక్విటీ (షేర్లు) నిబంధనలను సెబీ సడలించింది. దీని ప్రకారం.. ఏడాదికి 15 శాతం వరకు స్వెట్‌ ఈక్విటీలను ఈ కంపెనీలు జారీ చేయొచ్చు. మొత్తం మీద స్వెట్‌ ఈక్విటీ పరిమితి ఏ సమయంలోనైనా చెల్లించిన మూలధనంలో 50 శాతానికి మించకూడదని సెబీ పేర్కొంది. నగదుకు బదులుగా కాకుండా ఉద్యోగులకు ఇచ్చే షేర్లను స్వెట్‌ ఈక్విటీగా పరిగణిస్తారు. ఈ పొడిగించిన షేర్ల జారీ పరిమితి, కంపెనీ వ్యవస్థాపితమైన తేదీ నుంచి 10 ఏళ్ల కాలానికి వర్తిస్తుంది. మరోవైపు ప్రధాన ప్లాట్‌ఫాంపై నమోదైన కంపెనీలు వార్షికంగా జారీ చేసే స్వెట్‌ ఈక్విటీ పరిమితి కూడా 15 ఏళ్లుగా సెబీ నిర్ణయించింది. మొత్తంగా ఈ షేర్ల జారీని చెల్లించిన మూలధనంలో 25 శాతానికి పరిమితం చేసింది. ప్రమోటర్లు లేదా ప్రమోటర్ల గ్రూపునకు చెందిన ఉద్యోగులకు స్వెట్‌ ఈక్విటీని జారీ చేయాలంటే, ఆ ప్రతిపాదనను సాధారణ సమావేశంలో వాటాదార్లు సాధారణ మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాగా.. దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు అంకుర సంస్థలు పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సెబీ పై నిర్ణయాలను తీసుకోవడం గమనార్హం.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని