భారీ నష్టాలు.. నిఫ్టీ 14 వేల దిగువకు - Sensex Crashes Over 1000 Points
close

Updated : 27/01/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాలు.. నిఫ్టీ 14 వేల దిగువకు

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌.. విదేశీ సంస్థాగత మదుపరుల లాభాల స్వీకరణ వంటి అంశాలు మన మార్కెట్లను పడేశాయి. ముఖ్యంగా బ్యాంకు, ఆటో, మెటల్‌, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ మన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 14 వేల మార్కును కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ ₹72.92గా ఉంది.

ఉదయం 48,091 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా పడుతూనే ఉంది. ఒకానొక దశలో 1,000 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ చివరికి 937.66 పాయింట్ల నష్టంతో 47,409.93 వద్ద ముగిసింది. నిఫ్టీ 271.40 పాయింట్లు కోల్పోయి 13,967.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, విప్రో, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడ్డాయి. రంగాల వారీగా చూసుకుంటే ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.

అమెరికా ఫెడ్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్న వేళ అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు త్వరలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించినట్లు మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే, గత కొన్ని రోజులుగా మార్కెట్లు వరుసగా భారీ లాభాలు మూటగట్టుకున్న నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు దిగడంతో మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఇవీ చదవండి..
రూ. 90కి చేరువలో పెట్రోల్‌ ధర
జయహో భారత్‌



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని