Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Sensex Plunges Over 1000 Points at a stage
close

Updated : 28/09/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఇంట్రాడేలో భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సైతం 1.66 శాతం కుంగింది. అయితే, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. కానీ, పూర్తి స్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా స్థిరాస్తి, ఐటీ, మీడియా, సేవా, ఆర్థిక సేవలు, ఆటో రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంధన, పీఎస్‌యూ బ్యాంకింగ్‌, కమొడిటీస్‌, లోహ, ఫార్మా రంగ షేర్లు సూచీల పతనాన్ని ఒకింత కట్టడి చేయగలిగాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఎవర్‌గ్రాండ్‌, చైనాలో విద్యుత్తు కొరత సూచీలను కలవరపెట్టాయి. మరోవైపు బ్రిటన్‌లో ఇంధన కొరత, చైనాలో పరిస్థితుల దృష్ట్యా ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ పరిణామాలు నేటి ట్రేడింగ్‌లో  దేశీయ సూచీల సెంటిమెంటను మరింత దెబ్బతీశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 60,285.89 పాయింట్ల వద్ద స్తబ్ధుగా ప్రారంభమైంది. నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్న సూచీ ఐరోపా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో 59,045 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివరకు అమ్మకాల మద్దతుతో కోలుకున్న సూచీ.. 410 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకొని 59,667.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,912-17,576 మధ్య కదలాడి చివరకు 106 పాయింట్లు నష్టపోయి 17,748 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.03 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్ షేర్లు రాణించాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని