ప్చ్‌.. మళ్లీ రోజంతా నష్టాల్లోనే! - Sensex down by 600 pts
close

Published : 31/03/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌.. మళ్లీ రోజంతా నష్టాల్లోనే!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను నష్టాల్లో ముగించాయి. ప్రారంభం నుంచి సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఉదయం 50,049 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,442 వద్ద కనిష్ఠాన్ని తాకింది.  చివరకు 657 పాయింట్లు నష్టపోయి 49,509 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,811 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,813 - 14,670 మధ్య కదలాడింది. చివరకు 154 పాయింట్ల నష్టంతో 14,690 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద నిలిచింది. 

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు ప్రతికూలంగానే కదలాడాయి. నిన్నటి భారీ ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లను దెబ్బతీసింది. మరోవైపు కొవిడ్‌-19 టీకా వచ్చినప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల ఉత్పత్తి 2019 స్థాయి కంటే తక్కువగానే ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అలాగే భారత్‌లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో ఉందని మూడీస్‌ అనలిటిక్స్‌ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు మార్కెట్లు నేలచూపులు చూశాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలకు ఏ దశలోనూ మద్దతు దొరకలేదు. 

నిఫ్టీలో స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు లాభపడ్డాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, టెలికాం, విద్యుత్తు, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని