తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు - Sensex looses Over 1200 Points in intraday
close

Updated : 12/03/2021 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు నెమ్మదిగా దిగజారుతూ వచ్చాయి. ఒంటి గంట ప్రాంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే అందుకు కారణం. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,821 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత ఏకంగా 1,283 పాయింట్లు కుంగి 50,538 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 487 పాయింట్లు నష్టపోయి 50,792 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,321 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,336 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి 383 పాయింట్లు కోల్పోయి 14,953 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 143 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81 వద్ద నిలిచింది.

హాంకాంగ్‌ మినహా దాదాపు అన్ని ఆసియా సూచీలు లాభాల్లో ముగిశాయి. గురువారం అమెరికా సూచీలు సైతం భారీ లాభాల్ని ఒడిసిపట్టాయి. గత రెండు వారాల నుంచి మార్కెట్లు తీవ్ర అస్థిరతకు లోనవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మార్కెట్లు గరిష్ఠాలకు చేరడం, నేడు ఈ వారానికి చివరి ట్రేడింగ్‌ సెషన్‌ కావడంతో మదుపర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. యుటిలిటీస్‌, విద్యుత్తు, క్యాపిటల్‌ గూడ్సు రంగాల షేర్ల నుంచి కాస్త మద్దతు లభించడంతో మార్కెట్లు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కాస్త పైకి లేచినా చివరకు నష్టాల్లోనే ముగిశాయి.

భారత్‌ పెట్రోలియం, ఐవోసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాలను ఆర్జించాయి. బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని