Stock Market: మార్కెట్లలో బ్లడ్‌బాత్‌.. 1150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ - Sensex plummets 1158 pts to end at 59984
close

Updated : 28/10/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: మార్కెట్లలో బ్లడ్‌బాత్‌.. 1150 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌ కుదేలైంది. భల్లూకం పట్టు నుంచి బయటపడలేక విలవిల్లాడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు.. దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక ‘బేర్‌.. బేర్‌’మంటూ భారీ నష్టాలను మూటగట్టుకుంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమై 60వేల మార్క్‌ను కోల్పోగా.. నిఫ్టీ 18000 మైలురాయి కిందకు పడిపోయింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో దాదాపు రూ.4.5లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

ఆరంభం నుంచి నష్టాలే..

మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. 61,081 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఒక దశలో 1200 పాయింట్లకు పైగా పతనమై 59,777 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1158.63(1.89శాతం) పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 17,799 - 18,190 పాయింట్ల మద్య కదలాడి చివరకు 353.70(1.94శాతం) పాయింట్ల నష్టంతో 17,857 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, ఫార్మా రంగాల షేర్లు 2-5శాతం మేర కుంగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1శాతం మేర పడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 3.34శాతం నష్టపోయింది.

మార్కెట్‌ పతనానికి కారణాలివే..

* ఇటీవల పలు కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అయితే అందులో చాలా కంపెనీలు దలాల్‌ స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇది మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీపోర్ట్స్‌ వంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీసింది.

* క్రితం రెండు వారాల్లో దేశీయ మార్కెట్లు రికార్డు లాభాలతో పరుగులు తీశాయి. దీంతో ఈ వారం ఆరంభం నుంచే విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణ ప్రారంభించారు. అదే విధంగా దేశీయ మదుపర్లు కూడా అమ్మకాలకు మొగ్గుచూపారు. 

* నేటితో అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. సాధారణంగా ఈ  రోజున ఆప్షన్ల కాలవ్యవధి తీరనున్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ రోజు సెటిల్‌మెంట్‌ వాల్యూ కోసం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. 

* బ్యాంకింగ్ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 40000మార్క్‌ దిగువకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు భారీగా పతనమయ్యాయి. 

* వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్‌ రికార్డుల నుంచి వెనక్కి వచ్చి 250 పాయింట్లు కోల్పోయింది. నాస్‌డాక్‌ మాత్రం లాభాల్లో ముగిసింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని