లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Sensex rises 250 points
close

Published : 10/03/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల షేర్లు బలహీనపడడంతో మధ్యాహ్నం కాస్త నేల చూపులు చూశాయి. కొద్ది సేపటి తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి పుంజుకున్నాయి. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో  51,430 వద్ద గరిష్ఠాన్ని.. 51,048 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 254 పాయింట్లు లాభపడి 51,279 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,202 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,218 వద్ద గరిష్ఠాన్ని.. 15,100 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 69 పాయింట్ల లాభంతో 15,167 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.90 వద్ద నిలిచింది.

మంగళవారం అమెరికా సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. 1.9 బిలియన్‌ డాలర్ల కరోనా ఉద్దీపన పథకం ఆమోదం దిశగా పురోగతి, టెక్‌ షేర్ల దూకుడు అక్కడి మార్కెట్లను ముందుకు నడిపించాయి. బాండ్ల రాబడులు తగ్గుముఖం పట్టడం కూడా సూచీలకు కలిసొచ్చింది. దీంతో మంగళవారం డోజోన్స్‌ 0.10 శాతం, ఎస్‌అండ్‌పీ500 1.42 శాతం, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 3.69 శాతం ఎగిశాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతుండడం, అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ నేపథ్యంలో ప్రపంచ జీడీపీ అంచనాల్ని ఓఈసీడీ 1.4 శాతం పెంచించింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.6 శాతం మేర పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక దేశీయంగా లోహ, ఐటీ, టెక్‌ రంగాల షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఈ పరిణామాలన్నీ నేడు మార్కెట్లపై ప్రభావం చూపాయి. జపాన్‌ సూచీ నిక్కీ, చైనా సూచీ షాంఘై కాంపోజిట్‌ ఫ్లాట్‌గా ముగిశాయి. ఆస్ట్రేలియా సూచీ ఎస్‌అండ్‌పీ/ఏఎస్‌ఎక్స్‌ 0.7 శాతం నష్టపోయింది. హాంకాంగ్ సూచీ హాంగ్‌ సెంగ్‌ 0.3 శాతం, తైవాన్‌ సూచీ టీఎస్‌ఈసీ50 0.37 శాతం లాభపడ్డాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాలను ఆర్జించాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని