లభించని అండ.. భారీగా కుంగిన సూచీలు - Sensex tumbles 850 pts
close

Updated : 22/02/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లభించని అండ.. భారీగా కుంగిన సూచీలు

ముంబయి: సోమవారం ఊగిసలాటతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో గత వారం ఆరంభంలో వచ్చి పడిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ 15,000 పాయింట్ల కీలక దశను కోల్పోయింది. సెన్సెక్స్‌ సైతం 50వేల పాయింట్ల దిగువకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ స్వల్ప కాలంపాటు ఊగిసలాటకు లోనై 50,975 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ, ఏ దశలోనూ మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఓ దశలో 871 పాయింట్లు కోల్పోయి 50,018 వద్ద కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. 14,999 వద్ద స్వల్ప లాభంతో ఆరంభమై.. 14,754 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మధ్యాహ్నం 1:12 గంటల సమయానికి సెన్సెక్స్‌ 818 పాయింట్లు నష్టపోయి 50,069 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ ఏకంగా 212 పాయింట్లు కోల్పోయి 14,769 వద్ద ట్రేడవుతోంది.

ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఆసియా మార్కెట్లు తర్వాత మిశ్రమ ఫలితాలు చవిచూశాయి. దీంతో సూచీల సెంటిమెంటు మరింత బలహీనపడింది. దీనికి తోడు ఐటీ, వాహన, ఇంధన, విద్యుత్తు, టెక్‌, పీఎస్‌యూ, స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఆర్థికం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడం సూచీలపై ఒత్తిడి పెంచింది. బడ్జెట్‌ తర్వాత భారీగా లాభపడ్డ సూచీలు దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో గత వారం నుంచి లాభాల స్వీకరణ పరంపరను కొనసాగిస్తున్నాయి. దీంతో మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. లోహ, బేసిక్‌ మెటీరియల్స్‌, టెలికాం రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతుండడం నష్టాల్ని కాస్త పరిమితం చేస్తున్నాయనే చెప్పాలి.

హిందాల్కో ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీసీ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని