stock market: స్టాక్‌మార్కెట్‌లో బుల్‌ జోరు.. రూ.3లక్షల కోట్ల లాభం..!  - Sensex up 600 pts
close

Updated : 23/09/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: స్టాక్‌మార్కెట్‌లో బుల్‌ జోరు.. రూ.3లక్షల కోట్ల లాభం..! 

 800 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా పెరిగాయి. మధ్యాహ్నం 1.30 సమయంలో సెన్సెక్స్‌ 802 పాయింట్లు పెరిగి 59,729 వద్ద,  నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 17,777 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. శంకర్‌ బిల్డింగ్స్‌, వెల్‌స్పన్‌ ఇండియా, ఎవ్రీడే ఇండస్ట్రీస్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, వీమార్ట్‌ రిటైల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ , ఏషియన్‌ గ్రానిటో, జాగరణ్‌ ప్రకాశన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

ఒక దశలో రూ.3లక్షల కోట్ల లాభం..

సెన్సెక్స్‌ 800 పాయింట్లు లాభపడంతో బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన కంపెనీల విలువ రూ.3లక్షల కోట్లు పెరిగింది.     

ఫెడ్‌ వడ్డీరేట్లపై ఆశలు..

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లలో మార్పు చేయకపోవచ్చనే నిపుణుల అంచనాలు మార్కెట్లలో జోష్‌ నింపాయి. ‘‘వైరస్‌ వ్యాప్తిపై ఆర్థిక వ్యవస్థ జోరు ఆధారపడి ఉంది. ప్రజారోగ్య సంక్షోభం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్‌ జోరు కొనసాగాలి. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం రిస్క్‌ ఇప్పటికీ ఉంది’’ అని ఫెడ్‌ ప్రకటించింది. దీనికి తోడు నిన్న అమెరికా మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. డోజోన్స్‌, నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ నిఫ్టీ కూడా దాదాపు ఒక శాతం పైగా లాభపడ్డాయి. ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ సూచీ నిక్కీ కూడా భారీ లాభాల్లో ఉండటం కలిసొచ్చింది. అంతేకాదు ఫెడ్‌ నెలవారీ బాండ్ల కొనుగోళ్లను నవంబర్‌ నుంచి తగ్గించనున్నట్లు పేర్కొంది. దీంతో వడ్డీరేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.  

‘ఎవర్ గ్రాండే’ వివరణ.. 

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌ గ్రాండే సంక్షోభంపై వచ్చిన వివరణ మార్కెట్లను కొంత కుదుటపర్చింది. భయాలు పూర్తిగా తొలగకపోయినా.. లాభాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవర్‌ గ్రాండే సంక్షోభాన్ని తట్టుకొనేందుకు చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి బుధవారం 90 బిలియన్‌ డాలర్లను చొప్పించింది. మరోపక్క ఎవర్‌గ్రాండే ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ కష్టకాలం నుంచి సంస్థ కచ్చితంగా బయటపడుతుందని ఛైర్మన్‌ హుయి కా యువాన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సహకారంతో ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్థిక, స్థిరాస్తి రంగ షేర్ల ర్యాలీ..!

నేటి మార్కెట్‌లో స్థిరాస్తి రంగ షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ మెల్లగా పుంజుకోవడం వంటివి మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. తాజాగా చాలా బ్యాంకులు పండుగ ఆఫర్ల పేరిట రుణాలపై వడ్డీరేట్లను బాగా తగ్గించాయి. ఇది స్థిరాస్తి రంగంలో డిమాండ్‌ పెరగడానికి ఉపయోగపడనుంది. దీంతో ఆ రంగ షేర్లకు మంచి జోష్‌ ఇచ్చింది. గత నాలుగు సెషన్లలో బీఎస్‌ఈ రియాల్టీ రంగ సూచీ  దాదాపు 20శాతం పెరిగింది. ఫలితంగా 52 వారాల అత్యధికాన్ని తాకింది. గోద్రోజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు ఏకంగా 7శాతం లాభపడింది. 

మరోపక్క ఫైనాన్షియల్‌ సర్వీస్‌ షేర్లు  నేడు రాణిస్తున్నాయి.  బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సెస్‌ బ్యాంక్‌ షేర్లు 2 నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. 

టెక్నికల్‌ కారణాలు..

నిఫ్టీకి 17,650 వద్ద బలమైన ప్రతిఘటన ఎదురైంది. కానీ, ఆ సూచీ దీనిని తట్టుకొని 17,700 లెవల్‌ను దాటడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచింది. మార్కెట్‌ నిపుణులు కూడా నిఫ్టీ 18,000 మార్కును త్వరలోనే దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని