కరోనా కలవరంలో మార్కెట్లకు ఆర్‌బీఐ అండ! - Sensex up by 400 pts
close

Published : 07/04/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కలవరంలో మార్కెట్లకు ఆర్‌బీఐ అండ!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. ఉదయం సెన్సెక్స్‌ 49,277 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటన తర్వాత సూచీ ఒక్కసారిగా ఎగిసింది. 49,900 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 460 పాయింట్ల లాభంతో 49,661 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఉదయం 14,716 వద్ద ప్రారంభమైన సూచీ 14,879 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖరుకు 135 పాయింట్లు ఎగబాకి 14,819 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు సూచీలకు అండగా నిలిచాయి. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల ప్రతిఫలాలు స్వల్పంగా తగ్గాయి. దీంతో ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించింది. ఓవైపు కొవిడ్‌ కేసులు కలవరపెడుతున్నప్పటికీ.. భారత వృద్ధిరేటుపై అటు ఐఎంఎఫ్‌తో పాటు ఇటు ఆర్‌బీఐ అంచనాలు మదుపర్లకు భరోసానిచ్చాయి. ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5 శాతం నమోదవుతుందని ఐఎమ్‌ఎఫ్.. 10.5 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు మార్కెట్లు ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. 

ఒక్క ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్‌, టాటా కన్సూమర్‌ ప్రోడక్ట్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని