స్టాక్‌ మార్కెట్లకు రెండో వేవ్‌ భయాలు! - Sensex up by 800 pts
close

Updated : 24/03/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్లకు రెండో వేవ్‌ భయాలు!

భారీగా పతనమైన దేశీయ సూచీలు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లను బుధవారం కరోనా రెండో వేవ్‌ భయాలు కమ్మేశాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్నాయన్న వార్త మదుపర్లను కలవరపెట్టింది. దీంతో నేడు సూచీలు భారీగా నష్టపోయాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఉదయం 49,786 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక 14,712 వద్ద మొదలైన నిఫ్టీ రోజులో 14,535-14,752 మధ్య కదలాడింది. 265 పాయింట్లు కుంగి 14,549 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద నిలిచింది.

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బుధవారం నమోదైన కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు మరోసారి ఆంక్షలు ప్రకటించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నేలచూపులు చూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం భారీగా పతనమయ్యాయి. 

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, ఆర్థిక, మౌలిక రంగాల్లోని షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని