2022 ఏప్రిల్‌ కల్లా ఛైర్మన్‌, ఎండీ పదవుల విభజన - Separation of the posts of Chairman and MD by April 2022
close

Published : 07/04/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022 ఏప్రిల్‌ కల్లా ఛైర్మన్‌, ఎండీ పదవుల విభజన

నమోదిత కంపెనీలకు సెబీ సూచన

దిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌/ సీఈఓ పదవుల విభజన పూర్తి చేయాలని నమోదిత కంపెనీలకు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ సూచించారు. వాస్తవానికి 2020 ఏప్రిల్‌ 1 నుంచే ఈ రెండు పదవుల విభజన నిబంధన అమల్లోకి రావాల్సి ఉంది. అయితే పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు మరో రెండేళ్ల పాటు గడువును సెబీ పొడిగించింది. దీని ప్రకారం.. మార్కెట్‌ విలువపరంగా తొలి 500 స్థానాల్లో ఉన్న నమోదిత కంపెనీలకు 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది. ‘2020 డిసెంబరు నాటికి 500 కంపెనీల్లో 53 శాతం మాత్రమే ఈ నిబంధనను పాటించాయి. మిగిలిన సంస్థలు కూడా గడువు తేదీ వరకు వేచిచూడకుండా ముందుగానే ఈ మార్పునకు సిద్ధం కావాల’ని కార్పొరేట్‌ పరిపాలనా వ్యవహారాలపై సీఐఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో త్యాగీ అన్నారు. కంపెనీల్లో ప్రమోటర్ల స్థాయిని బలహీనపర్చాలన్నది ఈ నిబంధన వెనక ఉద్దేశం కాదని, కార్పొరేట్‌ పరిపాలనా మెరుగవుతుందనే లక్ష్యంతోనే దీనిని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘పదవుల విభజనతో మరింత సమర్థంగా యాజమాన్య పర్యవేక్షణకు వీలుండటం వల్ల పరిపాలనా వ్యవస్థలో సమతుల్యత వస్తుంది. ఒక్కరి పైనే పూర్తి అధికార బాధ్యతల భారం పడకుండా ఉంటుంద’ని త్యాగీ అభిప్రాయడ్డారు. చాలా కంపెనీల్లో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు పదవులను సీఎండీ పేరుతో కలిపే ఉంచారు. ఈ పరిణామం బోర్డు, యాజమాన్య వ్యవస్థ నిర్మాణంలో కొన్ని సమస్యలను తలెత్తుతున్నాయి. దీంతో పదవుల విభజనకు 2018 మేలో నిబంధనలను తీసుకొచ్చింది. కార్పొరేట్‌ పరిపాలనపై సెబీ ఏర్పాటు చేసిన కోటక్‌ కమిటీ సిఫారసుల్లో ఈ నిబంధనలూ భాగమే. ఛైర్మన్‌, ఎండీ/ సీఈఓ పదవుల విభజన దిశగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలూ యోచన చేస్తున్నాయని అజయ్‌ త్యాగీ తెలిపారు. పదవుల విభజనకు అనుకూలంగా బ్రిటన్‌, ఆస్ట్రేలియాలో చర్చ నడుస్తోంది. రెండంచెల బోర్డు వ్యవస్థ ఉన్న జర్మనీ, నెదర్లాండ్స్‌ దేశాలు బోర్డు, యాజమాన్య పాత్రలను విభజించే పనిలో ఉన్నాయి. కార్పొరేట్‌ పరిపాలనకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించే ఓఈసీడీ కూడా అత్యుత్తమ పరిపాలనా వ్యవహారాలకు పదవుల విభజన ముఖ్యమేనని సిఫారసు చేసింది.
బోర్డుల్లో మహిళా ప్రాతినిథ్యం పెరిగింది..
సంపద సృష్టిలో ప్రమోటర్లు, వ్యవస్థాపకులు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారనే విషయం సెబీకి తెలుసునని త్యాగీ స్పష్టం చేశారు. స్వత్రంత్ర డైరెక్టర్ల ఎంపికలో నాణ్యత, కార్పొరేట్‌ బోర్డు పనితీరులో పారదర్శకత తీసుకొచ్చేందుకు సెబీ ప్రయత్నిస్తోందని తెలిపారు. వాటాదార్లకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంపెనీలు తెలియజేయాలని, అసమానతలు ఉండకూడదని త్యాగీ స్పష్టం చేశారు. వ్యాపారం, పనితీరు, ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్‌-19 ప్రభావం ఏమేరకు పడిందనే సమాచారాన్నీ కంపెనీలు తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వం, సెబీ చేపట్టిన చర్యల కారణంగా మునుపటితో పోలిస్తే కార్పొరేట్‌ సంస్థ బోర్డుల్లో మహిళా ప్రాతినిథ్యం పెరిగిందని అన్నారు. 2014లో బోర్డుల్లో 5-6 శాతంగా ఉన్న మహిళల సంఖ్య 2015లో 12 శాతానికి (అత్యుత్తమ 500 నమోదిత కంపెనీల్లో) పెరిగింది. ప్రస్తుతం ఇది 17 శాతానికి చేరింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని