వాటితో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధర తక్కువే! - Serum Institute defends Covishield pricing says initial rates based on advance funding
close

Published : 24/04/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటితో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధర తక్కువే!

న్యూదిల్లీ: ప్రస్తుత మార్కెట్‌లో కొవిషీల్డ్‌ అత్యంత అందుబాటులో ధరలో లభించే వ్యాక్సిన్‌ అని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) తెలిపింది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ ధర విషయంలో తయారీదారులకు కేంద్రం కొన్ని వెసులుబాటు కల్పించింది. కొత్త ధరల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు వ్యాక్సిన్‌ను అందించేలా అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రూ.150కే కొనుగోలు చేయనుంది. ఒకే వ్యాక్సిన్‌ వేర్వేరు ధరలు ఉండటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్‌ వివరణ ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్‌ పేరుతో సీరమ్‌ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

ధరల విషయంలో వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ..  ప్రపంచంలో ఇతర వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు అందించే ధరలతో కొవిషీల్డ్‌ పోల్చి చూడాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అతిపెద్ద వ్యాక్సినేషన్‌ పక్రియలో భాగంగా తక్కువ ధరకే వ్యాక్సిన్‌ అందించినట్లు వెల్లడించింది. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైరస్‌ నిరంతరం మ్యూటేషన్‌ చెందుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరంగా వ్యాక్సిన్‌ను అందిస్తూ, ఉత్పత్తిని పెంచాలంటే మరిన్ని పెట్టుబడులు అవసరం. ఇందులో భాగంగా కొన్ని యూనిట్లను మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600 విక్రయిస్తాం. అయినా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఈ ధర తక్కువే’’ అని సీరమ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం మే 1వ తేదీ తర్వాత కూడా 50శాతం వ్యాక్సిన్‌లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అందిస్తామని సీరమ్‌ ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 50శాతం వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు అందించనున్నట్లు తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని