Service Sector PMI: వరుసగా మూడో నెలా నెమ్మదించిన సేవారంగ కార్యకలాపాలు! - Service Sector PMI down for the 3rd straight month
close

Published : 04/08/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Service Sector PMI: వరుసగా మూడో నెలా నెమ్మదించిన సేవారంగ కార్యకలాపాలు!

ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సేవా రంగ కార్యకలాపాలు వరుసగా మూడో నెలా దెబ్బతిన్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సేవారంగం నెమ్మదించింది. జులైలో ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 45.4గా నమోదైంది. జూన్‌లో నమోదైన 41.2తో పోలిస్తే ఇది కాస్త పుంజుకుంది. పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ మేరకు ఐహెచ్ఎస్​మార్కెట్​ నెలవారీ సర్వే నివేదిక బుధవారం విడుదలైంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిమాండ్‌ కుంటుపడిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రతినిధి లీమా తెలిపారు. వ్యాపారాలు, ఉత్పత్తి, ఉద్యోగాలు పడిపోయాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగానూ సేవారంగంలో డిమాండ్‌ పడిపోయిందని తెలిపారు. కన్జ్యూమర్‌ సర్వీసులు భారీగా దెబ్బతిన్నాయి. ఒక్క రవాణా, నిల్వ రంగాలు మాత్రం ఫరవాలేదనిపించాయి.

మరోవైపు నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయాయని సర్వే వెల్లడించింది. ఇంధనం, వైద్య పరికరాలు, ముడిపదార్థాల ధరలు జులైలోనూ పెరిగాయని పేర్కొంది. ఇక ఈ రంగంలో ఉద్యోగ కల్పనా క్షీణించిందని స్పష్టం చేసింది. రానున్న 12 నెలల పాటు సేవారంగంలో ఒడుదొడుకులు కొనసాగనున్నాయన్న అంచనాల నేపథ్యంలోనే కొత్త ఉద్యోగుల్ని తీసుకోవడానికి సంస్థలు ముందుకు రావడం లేదని అభిప్రాయపడింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని