Elon musk: ఉత్పాదకత పెంపునకు 7 సూత్రాలు! - Seven rules musk suggested to improve productivity in companies
close

Updated : 07/05/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Elon musk: ఉత్పాదకత పెంపునకు 7 సూత్రాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్‌ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్‌.. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ ద్వారా అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ భవిష్యత్తు జీవన విధానానికి కావాల్సిన సాంకేతికతను సమకూరుస్తున్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సంచలనం సృష్టిస్తున్న టెస్లా..  చంద్రుడు, అంగారకుడిపై కాలనీలు, స్పేస్‌ టూరిజమే లక్ష్యంగా సాగుతున్న స్పేస్‌ ఎక్స్‌ ప్రయాణం మస్క్‌ ఆలోచనలకు మచ్చు తునకలు. మరి ఇంతటి సక్సెస్‌ అందుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఎలాన్‌ మస్క్‌ చెప్పే సూత్రాలు ఎంత విలువైనవో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కంపెనీ ఉత్పాదకతను(Productivity) పెంచేందుకు పలు సూచనలు చేస్తూ ఓసారి ఆయన టెస్లా ఉద్యోగులకు లేఖ రాశారు. తాజాగా ఆ అంశాలను అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ ప్రాపరటీ.కామ్‌(properati.com) యజమాని గాబ్రియెల్‌ గ్రూబర్‌ గుర్తుచేశారు. వీటికి మస్క్‌ స్పందిస్తూ ‘ఎగ్జాట్లీ’ అంటూ ఆయన ప్రతిపాదనలను ఆయనే మరోసారి ధ్రువీకరించారు.

ఇంతకీ ఆయన చెప్పిన సూత్రాలు ఏంటంటే...

* మితిమీరిన సమావేశాలు పెద్ద కంపెనీల పనితీరును దెబ్బతీస్తాయి. పెద్ద పెద్ద సమావేశాలకు దూరంగా ఉండాలి. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అవి ఉపయోగపడతాయనుకుంటే తప్ప, లేదంటే వీలైనంత తక్కువ సమయంలో వాటిని ముగించేయాలి.

* అత్యవసరమైతే తప్ప తరచూ సమావేశాలు నిర్వహించొద్దు. కీలక అంశం ఒకసారి చర్చించడం అయిపోతే ఇక సమావేశాల సంఖ్యను కుదించాలి.

* మీకు ఎలాంటి ప్రయోజనం లేదనుకుంటే వెంటనే సమావేశం నుంచి వెళ్లిపోండి. అలా వెళ్లడం అనాగరికం ఏమీ కాదు. కూర్చొని సమయాన్ని వృథా చేసుకోవడమే అనాగరికం.

* ఏదైనా వివరించడానికి సంక్షిప్త పదాలు, సంకేతాలు వాడొద్దు. ఏదైనా వివరంగా చెప్పాలనుకున్నప్పుడు  ఇలాంటివి ఉపయోగించడం వల్ల చేరాల్సిన సమాచారం సరిగా చేరకపోవచ్చు. 

* సమాచారం గమ్యస్థానం చేరడానికి ఒక నిర్దిష్టమైన అధికార స్థాయిలు ఉండాల్సిన అవసరం లేదు. వీలైనంత తక్కువ సమయంలో, చిన్న మార్గంలో సమాచారం లక్షిత వ్యక్తుల వద్దకు చేరాలి. 

* వివిధ విభాగాల మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేకపోవడం సమస్యలకు కారణమవుతుంటుంది. అన్ని విభాగాల మధ్య పరస్పర సమాచార ప్రవాహం ఉండాలి.

* ఎప్పుడూ కామన్‌ సెన్స్‌నే నియమావళిగా భావించి పనిచేయాలి. ఒక నిర్దిష్ట నిబంధనల్ని పాటించాలని చూస్తే ప్రత్యేక పరిస్థితుల్లో అది పనిచేయకపోవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని