షెన్జెన్ ప్రయోగమే చైనా విజయం!
ఓ కుగ్రామం మహా నగరంగా మారింది. ఒకప్పుడు మత్స్యకారులకు ఆవాసంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లకు వల వేస్తోంది. సాంకేతికత సృష్టిలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీకే సవాల్ విసురుతోంది. సొంత దేశ ఆర్థిక వ్యవస్థ విజయాలకు నిలువుటద్దంలా నిలుస్తోంది. ఇదీ చైనాలోని షెన్జెన్ నగర 40 ఏళ్ల ప్రయాణం.
హువావే, జెడ్‌టీఈ ఇక్కడే
3000 మంది జనాభాతో చిన్న గ్రామంగా ఉన్న షెన్జెన్ ఇప్పుడు ప్రపంచ మేటి నగరాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఈ నగర జనాభా రెండు కోట్లు. చైనాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరం ఇదే. అమెరికా సిలికాన్ వ్యాలీకి దీటైన నగరం నిర్మించాలన్న చైనా కలలు షెన్జెన్ రూపంలో సాకారం అవుతున్నాయి. ఇప్పటికే హువావే, టెన్సెంట్, జెడ్‌టీఈ, బీవైడీ, బీజీఐ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువు దీరాయి. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశం 1970లో రచించిన ఆర్థిక ప్రణాళికలకు షెన్జెన్ ఓ ప్రతిరూపం. కఠినమైన రక్షణాత్మక ఆర్థిక విధానాల నుంచి స్వేచ్ఛాయుత మార్కెట్లోకి ప్రవేశించిన ప్రతిఫలం.
తొలి సెజ్ ఇక్కడే
నేడు చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. దీని వెనుక 40 ఏళ్ల ప్రయాణం ఉంది. అది షెన్జెన్ నుంచే ప్రారంభమయ్యింది. ఆధునిక చైనా రూపశిల్పి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా పేరొందిన డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు షెన్జెన్ ఓ నిదర్శనం. 1970ల్లో చైనాలో పేదరికం రాజ్యమేలుతోంది. ఈ సమస్యను దీటుగా ఎదుర్కోవాలంటే అప్పటి వరకు పాటిస్తున్న ఆర్థిక విధానాలను ప్రత్యామ్నాయం కావాల్సిందేనని డెంగ్ తలచారు. అందుకు స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థను నెలకొల్పాలని సంకల్పించారు. అందుకోసం ప్రత్యేక ఆర్థిక మండళ్ల(స్పెషల్ ఎకనమిక్ జోన్-ఎస్ఈజెడ్)ను నెలకొల్పాలని నిర్ణయించారు. అలా మొట్టమొదటి సెజ్ 1979లో షెన్జెన్లో ఏర్పాటైంది. అప్పటికి బ్రిటిష్ అధీనంలో ఉన్న హాంకాంగ్‌కు దగ్గరగా ఉండడమే షెన్జెన్ ఎంపికకు ప్రధాన కారణం. అక్కడి నుంచి సహకారం లభించొచ్చనే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సెజ్‌గా ఎంపిక చేశారు. దీంతో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రైవేట్ సంస్థలు తరలివచ్చాయి. డెంగ్ కలలు ఒక్కొక్కటిగా సాక్షాత్కారమవుతున్నాయి. షెన్‌జెన్‌తో పాటు మరో మూడు ప్రాంతాలను కూడా సెజ్లుగా ప్రకటించారు. అయితే, అవేవీ అంతగా విజయం సాధించలేకపోయాయి.
సవాళ్లు తప్పలేదు
కమ్యూనిస్టు దేశమైన చైనాలో స్వేచ్ఛాయుత మార్కెట్ విధానాల అమలు అంటే ఓ సవాలే. మొదట్లో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓ దశలో ప్రాజెక్టు పూర్తిగా స్తంభించిపోయింది. తియాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. కానీ, 1992లో డెంగ్ దక్షిణ ప్రాంత పర్యటన మరోసారి షెన్జెన్కు ప్రాధాన్యం తీసుకొచ్చేలా చేసింది. పట్టాలెక్కిన ప్రాజెక్టు మధ్యలోనే ఆగి పోయిన తీరు డెంగ్‌ను ఆలోచింపజేసింది. అప్పటికే అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి తిరిగి దాన్ని పునరుద్ధరించాలని భావించారు. అంతే, అక్కడి నుంచి ఇప్పటి వరకు షెన్జెన్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.
నగర నిర్మాణమే ఓ అద్భుతం
షెన్జెన్ ఇప్పుడు ప్రపంచంలోనే కొన్ని ప్రసిద్ధ ఆకాశహర్మ్యాలకు నెలవు. పింగ్ అన్ ఫినాన్స్ సెంటర్, కేకే100, చైనా రీసోర్స్ హెడ్‌క్వార్టర్స్, షమ్ యిప్ అప్పర్హిల్స్ టవర్1 వంటి ప్రసిద్ధ స్కైస్క్రాపర్లు ఇక్కడే కొలువుదీరాయి. డెంగ్ ఆలోచనలకు నగర అధికారుల సహకారం తోడైంది. ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణానికి పక్కా వ్యూహాలు రచించారు. తొలుత నగరాన్ని ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్లో రోడ్లు, రహదారులు, రింగ్‌రోడ్లు ఇలా ఒక్కోటి నిర్మించకుంటూ ఒక క్లస్టర్ని మరో క్లస్టర్‌కి అనుసంధానించారు. అయితే, ఓ దశలో స్థలాభావం ఏర్పడడంతో ఆకాశహార్మ్యాలకు శ్రీకారం చుట్టారు. ఉన్న భూమిని చక్కగా వాడుకొని ప్రపంచస్థాయి కంపెనీలకు షెన్జెన్ను చిరునామాగా మార్చారు. ఈ క్రమంలో ఒకప్పుడు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన భవనాల్ని సర్కారే తిరిగి కొనుగోలు చేసింది. వాటిని మరింత విశాలమైన, ఎత్తయిన ఆకాశహార్మ్యాలుగా తీర్చి దిద్ది వారికే అప్పగించింది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అన్ని హంగులు దిద్ది వాటినే అర్బన్ విలేజెస్‌గా మార్చారు. ఆ గ్రామాలే క్రమంగా కుటీర, చిన్న మధ్యస్థాయి పరిశ్రమలు, ఎంటర్ప్రైజ్లకు శ్రీకారం చుట్టాయి. అలా ప్రారంభమైన షెన్జెన్ పారిశ్రామికీకరణ.. ఇప్పుడు ప్రపంచస్థాయి బహుళజాతి సంస్థల ఏర్పాటు వరకు కొనసాగింది. ఈ క్రమంలో చైనా వ్యాప్తంగా ఉన్న నైపుణ్య కార్మికులు ఇక్కడికి తరలిరావడం కూడా షెన్జెన్ విజయానికి దోహదం చేసింది.
భవిష్యత్తూ దీని చుట్టే
40 ఏళ్ల క్రితం చేపల వేటకు నెలవైన ఓ గ్రామం ఇప్పుడు మరో సిలికాన్ వ్యాలీగా రూపుదిద్దుకుంది. అమెరికాతో వాణిజ్య విభేదాల నేపథ్యంలో చైనా అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించాలని యోచిస్తోంది. ముఖ్యంగా చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీలో ఉన్న లోటును అధిగమించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ రంగంలోని పరిశ్రమలకు పన్ను విరామం కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చైనా ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సైతం షెన్జెన్పైనే వైపే చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు సెమీకండక్టర్లు, చిప్‌ల పరిశ్రమలకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యం షెన్జెన్కు పుష్కళంగా ఉంది. అలాగే ‘గ్రేటర్ బే ఏరియా’ పేరిట హాంకాంగ్, మకావూ చుట్టూ ఉన్న నగరాల సమాహారంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమిక్, బిజినెస్ హబ్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో షెన్జెన్ కూడా భాగమే. నాటి డెంగ్ నుంచి నేటి జిన్‌పింగ్ వరకు చైనా ఆర్థిక ఆశయాలకు షెన్జెన్ ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నా వద్ద జీవన్ సరళ్ పాలసీ ఉంది, 2010 నుంచి రూ. 30,025 ప్రీమియం చెల్లించాను. సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
-
Q. నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండ మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.
-
Q. నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు మా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తాను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్‌గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?