క్రెడిట్ కార్డ్‌ లిమిట్ పెంచుతున్నారా?  - Should-you-increase-your-credit-limit-on-credit-card
close

Updated : 27/02/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ కార్డ్‌ లిమిట్ పెంచుతున్నారా? 

కొత్త  క్రెడిట్ కార్డుల‌కు ప‌రిమితి త‌క్కువ‌గా ఉంటుంది. కార్డు తీసుకున్న వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌పై ప‌రిమితి పెంపు ఆధార‌ప‌డి ఉంటుంది. స్థిర‌మైన ఖ‌ర్చులు చేస్తూ, స‌మ‌యానికి బిల్లులు చెల్లించే వారిని గుర్తించి, వారికి క్రెడిట్ లిమిట్‌ను పెంచుకునేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి బ్యాంకులు. కానీ ప‌రిమితిని పెంచితే అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు చేసి అప్పుల భారిన ప‌డ‌తామ‌ని భ‌య‌ప‌డేవారు కూడా ఉన్నారు. ‌ మ‌రి క్రెడిట్ కార్డు ప‌రిమితి పెంపు ఆఫ‌ర్‌ను అంగీక‌రించ‌డం మంచిదేనా.. 

క్రెడిట్ కార్డు పరిమితి పెంపు వలన కలిగే లాభ‌న‌ష్టాల‌ను తెలుసుకుందాం..

లాభాలు:

ఎక్కువ క్రెడిట్ స్కోర్..

క్రెడిట్ స్కోరులను లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరోస్ క్రెడిట్ వినియోగ నిష్పత్తి(సీయూఆర్‌)ని పరిగణిస్తాయి. ఈ నిష్పత్తి మీరు ఉపయోగించిన మొత్తం క్రెడిట్ పరిమితిని సూచిస్తుంది. రుణదాతలు 30 నుంచి 40 శాతం క్రెడిట్ వాడకం నిష్పత్తితో ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు, 40 శాతం కంటే ఎక్కువ పరిమితిని వినియోగించిన వారి క్రెడిట్ స్కోరును క్రెడిట్ బ్యూరోస్ తగ్గిస్తాయి.

క్రెడిట్ స్కోరును మెరుగుప‌రుచుకునేందుకు సీయూఆర్‌ని నిష్ప‌త్తి  30శాతం ఉండేట్లు చూసుకోవ‌డం ముఖ్యం. ఈ స్థాయిని మించి త‌రుచుగా వినియోగించేవారు క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవ‌డం మంచిది. ప్ర‌స్తుతం వినియోగిస్తున్న క్రెడిట్ కార్డు ప‌రిమితిని పెంచేందుకు బ్యాంకు నిరాక‌రిస్తే, వేరే సంస్థ నుంచి మ‌రొక క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఉదాహ‌ర‌ణ‌కి, మీ క్రెడిట్ కార్డు ప‌రిమితి రూ.1 ల‌క్ష అనుకుందాం. క్రెడిట్ కార్డు ద్వారా ప్ర‌తీ నెల రూ.50వేలు ఖ‌ర్చు చేస్తే, ఈ సీయూర్ నిష్ప‌త్తి 50శాతం ఉంటుంది. ఈ సంద‌ర్భంలో బ్యాంకు క్రెడిట్ కార్డు ప‌రిమితిని రూ.1.7 ల‌క్ష‌ల‌కు పెంచుకుంటే, సీయూఆర్ నిష్ప‌త్తి 29శాతానికి త‌గ్గుతుంది. ఒక‌వేళ మీ బ్యాంకు క్రెడిట్ లిమిట్‌ను పెంచేందుకు నిరాక‌రిస్తే, రూ.70 వేల లిమిట్‌తో మ‌రొక క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. 

పెద్ద మొత్తంలో లావాదేవీలకు ఉపయోగకరం:

ప్రస్తుత రోజుల్లో, క్రెడిట్ కార్డులను జారీ చేసే చాలా సంస్థలు వార్షిక రుసుమును రద్దు చేయడం లేదా సంస్థ ప్రతిపాదించిన నిర్దిష్ట మొత్తాన్ని వినియోగించిన వారికి ఉచిత వోచర్లు / విమాన టిక్కెట్లను అందిస్తుంది. దానితో పాటు మీరు వెచ్చించే అధిక మొత్తానికి గాను రివార్డ్ పాయింట్లను సంపాదించుకోవచ్చు.

ఈ విధంగా, అధిక క్రెడిట్ పరిమితి అనేది కేవలం మొత్తం క్రెడిట్ కార్డు లావాదేవీల సామర్థ్యాన్ని పెంచడానికే కాకుండా, అది మీ పెద్ద లావాదేవీలను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించేందుకు సహాయపడుతుంది. అలాగే మంచి క్రెడిట్ చరిత్ర కలిగిన వారు పెద్ద మొత్తంలో చేసిన లావాదేవీలను ఆకర్షణీయమైన రేట్లలో ఈఎంఐలలోకి కూడా మార్చుకోవచ్చు.

ఆర్థిక సంక్షోభంలోనూ..

క్రెడిట్ కార్డు పరిమితి పెంపు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవటానికి చాలా సహాయ పడుతుంది. ఉద్యోగం కోల్పోవ‌డం, అనారోగ్యం, ప్ర‌మాదం వంటి వాటి కార‌ణంగా ఏర్ప‌డే ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో క్రెడిట్ కార్డు ప‌రిమితి పెంపు అత్య‌వ‌స‌ర నిధిగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఊహించ‌ని ప‌రిస్థితుల‌లో నిధుల కొర‌త ఉండ‌దు. అలాగే, క్రెడిట్ కార్డు బిల్లును గ‌డువు తేదీలోగా చెల్లించ లేక‌పోతే, మొత్తం బిల్లును లేదా బిల్లులో కొంత భాగాన్ని ఈఎమ్ఐ మార్చుకోవ‌డం ద్వారా వార్షికంగా 30 నుంచి 49 శాతం వ‌ర‌కు వ‌ర్తించే వ‌డ్డీల భారీ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. 

అధిక‌ మొత్తంలో రుణం..

చాలా మంది క్రెడిట్ కార్డు జారీదారులు మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న వారికి క్రెడిట్ కార్డు ఆధారంగా ముందుగా ఆమోదించిన రుణాలను అందిస్తారు. ఈ రుణాలు వ్యక్తిగత రుణాలకు సమానంగా ఉంటాయి. అలాగే వడ్డీ రేట్లు, రుణ కాలపరిమితి కూడా సాధారణంగా వ్యక్తిగత రుణాలకు సమానంగా ఉంటాయి. ముందస్తు ఆమోదం పొందిన రుణాలు ఎక్కువగా దరఖాస్తు చేసిన రోజే వినియోగదారుడి ఖాతాలో జమవుతాయి. కానీ వ్యక్తిగత రుణాల పంపిణీ మాత్రం 2 నుంచి 7 రోజుల వరకు సమయం తీసుకోవచ్చు.

న‌ష్టాలు:

రుణాల భారిన ప‌డొచ్చు..

పెరిగిన క్రెడిట్ కార్డు ప‌రిమితి, ఎక్కువ ఖ‌ర్చు చేసే వీలు క‌ల్పిస్తుంది. ఒక్కోసారి అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా కొనేస్తూ ఉంటారు. దీంతో గ‌డువు స‌మ‌యానికి బిల్లు చెల్లించ‌లేక, రుణం తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌పోతే క్రెడిట్ స్కోరుపై తీవ్ర‌ ప్ర‌భావం ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో రుణాలు ల‌భించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

ఎక్కువ సంఖ్య‌లో కార్డులు తీసుకోవ‌డం ద్వారా కూడా క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. అయితే ఇది మిమ్మ‌ల్ని క్రెడిట్ కార్డుల‌పై ఆధార‌ప‌డేలా చేసే అవ‌కాశం ఉంది. దీంతో మ‌రింతగా రుణాల ఊబిలో చిక్కుకు పోయే అవ‌కాశం ఉంటుంది. 

అధిక వ‌డ్డీ..

ప్ర‌తీ నెల క్రెడిట్ కార్డు బిల్లు స‌మ‌యానికి చెల్లించాలి. ఒక‌వేళ చెల్లించ‌లేక‌పోతే, అవుట్‌స్టాండింగ్ మొత్తంపై అధిక వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. క్రెడిట్ లిమిట్ పెరిగితే, ఖ‌ర్చు చేసే అవ‌కాశం కూడా ఎక్కువ‌వుతుంది, కాబ‌ట్టి బిల్లు స‌మ‌యానికి చెల్లించ‌లేని ప‌రిస్థితి రావ‌చ్చు. దీంతో అధిక వ‌డ్డీల భారం ప‌డుతుంది. అందువ‌ల్ల  ప్ర‌తీ నెల స‌రైన స‌మ‌యానికి పూర్తి క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించండి. 

కార్డు పోగొట్టుకుంటే..

ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ దొంగిలించబడితే, క్రెడిట్ పరిమితి ఎక్కువగా ఉన్నందున నష్టం ఎక్కువ అవుతుంది. అందువల్ల, అధిక క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించండి.

ముగింపు:
క్రెడిట్ కార్డు ప‌రిమితి పెంపుతో లాభాలు ఉన్నాయి. అలాగే, న‌ష్టాలు కూడా ఉన్నాయి. పూర్తి అవ‌గాహ‌న‌తో భాద్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిమితి పెంచుకోవ‌డంలో ఎంటువంటి న‌ష్టం ఉండ‌దు. మ‌న నెల‌వారీ ఆదాయం ఎంత‌, ఎంత ఖ‌ర్చు చేస్తున్నాం, గ‌డువు స‌మ‌యానికి తిరిగి చెల్లించ‌గ‌ల‌మా అనే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఖ‌ర్చుల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని