ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా? - Should you invest in gold now
close

Updated : 23/03/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా?

ఆర్థిక సంక్షోభంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా పసిడికి పేరుంది. కరోనా సంక్షోభ సమయంలో ఈక్విటీలు, ఎక్కువరాబడి ఇచ్చే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్ల వంటి విలువ భారీగా పడిపోయింది. పసిడి ధరలు మాత్రం కొత్త గరిష్ఠాలకు చేరాయి. అయితే, అనేక కారణాలతో అవి మెల్లగా కిందకు దిగొచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా? అన్న ప్రశ్న సామాన్య మదుపర్లను వెంటాడుతోంది.

ధరలు ఎందుకు తగ్గాయి?

బంగారం ధరల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల దగ్గర నుంచి స్థానిక గిరాకీ వరకు చాలా అంశాలు పసిడి ధరల్ని నిర్ణయిస్తాయి. అయితే, అమెరికా డాలర్‌ బలపడడం, బాండ్ల ప్రతి ఫలాలు ఎగబాకడం తాజాగా బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం. అలాగే కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు క్రమంగా గాడిలోకి వస్తుండడంతో బంగారంతో పోలిస్తే కాస్త నష్టభయాలు ఎక్కువ ఉన్నప్పటికీ.. ఈక్విటీ, డెట్‌, మ్యూచువల్‌ ఫండ్ల వైపు మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. ఇది కూడా పసిడి ధరలకు కళ్లె వేస్తున్న కారణాల్లో ముఖ్యమైనది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో కొత్త గరిష్ఠాలకు చేరిన పుత్తడి ధరలు.. వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక దాదాపు 20 శాతం మేర తగ్గాయి. 

పెట్టుబడి పెట్టొచ్చా..?

నిజానికి బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది మదుపర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే, సాధారణంగా పెట్టుబడి పెట్టడానికి ముందు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా కదలాడుతుంటాయనే దానిపై అవగాహన ఉంటే మంచిది.

* బంగారం ధరల్ని సరఫరా-గిరాకీ సూత్రం, భౌగోళిక రాజకీయాలు, డాలర్‌ విలువ, చమురు ధరల వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యలభ్యత, పసిడి వాస్తవిక విలువకు మార్కెట్‌ ధరలకు సంబంధం ఉండకపోవచ్చు. అందుకే, ఒక్కోసారి బంగారం ధరల్లో చాలా కాలం పాటు ఎలాంటి మార్పూ ఉండదు. ఒక్కోసారి హఠాత్తుగా పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఏ సమయంలో బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తే మంచి రాబడి వస్తుందో అంచనా వేయాలి. అయితే, ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఓ రాయి వేసి చూద్దాం అన్నట్లుగా కాకుండా మీ అవసరాలు, లక్ష్యాలననుసరించి పెట్టుబడులు పెట్టాలా?లేదా? అన్నదానిపై ముందుకు వెళ్లండి.

* అలాగే బంగారాన్ని భౌతికంగా కొనడానికి బదులు పసిడి బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలి. వీటిలో మదుపు చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

ఎంత మేర పెట్టాలి..? 

ఒకవేళ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటే ఎంత మొత్తం బంగారానికి కేటాయించాలనేది కీలక అంశం. అయితే, భారీగా లాభాలొస్తున్నాయన్న ఆశతో మొత్తం పెట్టుబడులను పసిడిలోకే మళ్లించడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ బంగారం ధరలు భారీగా పతనమైతే పెట్టుబడులు మొత్తం ఒక్కసారి హరించుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందు చెప్పినట్లుగా వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో 5-15 శాతం వరకు బంగారానికి కేటాయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 - ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి...

సార్వభౌమ ప‌సిడి బాండ్లే ఎందుకు?

ఐపీఓల్లో మదుపు.. ఇవన్నీ చూశాకే..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని