స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 13% తగ్గాయ్‌ - Smartphone sales fell 13 percent
close

Published : 23/07/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 13% తగ్గాయ్‌

జూన్‌ త్రైమాసికంపై పరిశోధనా సంస్థ కెనాలీస్‌ 

దిల్లీ: కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతితో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు త్రైమాసిక ప్రాతిపదికన 2021 ఏప్రిల్‌-జూన్‌లో 13 శాతం క్షీణించి 3.24 కోట్లకు పరిమితమయ్యాయని పరిశోధనా సంస్థ కెనాలీస్‌ వెల్లడించింది. 2020 ఇదే సమయంతో పోలిస్తే మాత్రం 87 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2020 (కొవిడ్‌ తొలి దశలో) ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల సరఫరాలు బాగా తగ్గాయి. అందువల్ల అప్పటితో పోలిస్తే ఈసారి బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది.
* షియామి 29 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 95 లక్షల ఫోన్లను జూన్‌ త్రైమాసికంలో విక్రయించింది.
* శామ్‌సంగ్‌ 17 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. 55 లక్షల ఫోన్లను విక్రయించింది. వివో 54 లక్షల ఫోన్లను విక్రయించి మూడో స్థానంలో ఉంది.
* ఒపో స్థానాన్ని రియల్‌మి దక్కించుకుంది. 49 లక్షల (15 శాతం వాటా) ఫోన్లను విక్రయించగా, ఒపో 12 శాతం వాటాతో 38 లక్షల ఫోన్లను విక్రయించింది.
* కొవిడ్‌-19 కేసులు రెండో దశలో విపరీతంగా పెరగడం, స్థానిక ఆంక్షలకు తోడు వినియోగదారుల ఆదాయం బాగా తగ్గడంతో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని కెనాలీస్‌ అనలిస్ట్‌ సాన్యం చౌరాసియా వెల్లడించారు.


కొవిడ్‌తో మరణించిన భాగస్వాముల కుటుంబాలకు తోడ్పాటు: ఓయో

దిల్లీ: తమ హోటల్‌ భాగస్వాములు, ఇంటి యాజమానులు కొవిడ్‌-19 బారిన పడి మరణిస్తే వారి కుటుంబాలకు పలు ప్రయోజనాలు అందించేందుకు ‘సమర్థన్‌ బై ఓయో’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఓయో వెల్లడించింది. బాధిత కుటుంబంలో ఇద్దరు వరకు పిల్లల విద్యకు అయిదేళ్ల పాటు ఆర్థిక సాయం, యాజమాని భార్య, ఒక బిడ్డకు మూడేళ్ల పాటు రూ.5 లక్షల వరకు వైద్య కవరేజీ పొడిగింపు వంటి వాటిని ఓయో అందించనుంది. 3 నెలల కమీషన్‌ మంజూరు చేయడం, రికవరీ ఛార్జీల రద్దు, మరణించిన భాగస్వామికి సంబంధీకులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇస్తామని తెలిపింది.


అమెరికాలోని గ్రాన్యూల్స్‌ ఇండియా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆడిట్‌ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియాకు అమెరికా వర్జీనియాలో ఉన్న యూనిట్‌కు  అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆడిట్‌ అనుమతి ఇచ్చింది. ఈ యూనిట్‌ను గత నెలలో యూఎస్‌ఎఫ్‌డీఏ బృందం తనిఖీ చేసి, 2 స్వల్ప అభ్యంతరాలు వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఈ అభ్యంతరాలకు నిర్ణీత సమయంలోనే తగిన సమాధానం ఇవ్వడంతో, ఆడిట్‌ అభ్యంతరాలను ముగించి  అనుమతి ఇచ్చినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. గ్రాన్యూల్‌్్స ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనుంది. వాటాదార్లకు మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చే అంశాన్ని ఆరోజు జరిగే డైరెక్టర్ల బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని