ఆశ్రిత రుణాలను నిరోధించండి: కె.వి.సుబ్రమణియన్‌ - Stay away from crony lending says CEA
close

Published : 09/03/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆశ్రిత రుణాలను నిరోధించండి: కె.వి.సుబ్రమణియన్‌

దిల్లీ: భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో దన్నుగా నిలిచే సంస్థలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్‌ ఆర్థిక సంస్థలకు సూచించారు. ఈ క్రమంలో ఆశ్రితవర్గాలకు రుణాలు అందజేయడాన్ని నిరోధించాలని నొక్కి చెప్పారు. 1990 ఆర్థిక సంస్కరణల నాటి నుంచి రుణాల నాణ్యత విషయంలో భారత్‌లో బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అర్హత కలిగిన వారికి రుణాలు అందలేదని.. ఆశ్రితవర్గాల చేతుల్లోకే సొమ్ము వెళ్లిందని ఆరోపించారు. దీంతో బ్యాంకులు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. మంగళవారం ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో సరైన స్థాయిలో మూలధన కేటాయింపులు జరిగేలా చూడడం ఆర్థిక సంస్థల బాధ్యత అని సుబ్రమణియన్‌ తెలిపారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న మౌలిక రంగం వైపు బ్యాంకులు ఎక్కువ మొగ్గుచూపడమే మొండి బకాయిల పెరుగుదలకు ముఖ్య కారణమని వివరించారు. దీన్ని నిరోధించి నాణ్యత కలిగిన రుణాల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసే బాధ్యతను తీసుకోవాలని ఆర్థిక సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక సంస్థల కార్పొరేట్‌ పాలనను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక దేశవ్యాప్తంగా మౌలిక రంగ ప్రాజెక్టకులకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రూ.లక్ష కోట్లతో డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌(డీఎఫ్‌ఐ) ఏర్పాటు చేయనున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు. దీంతో నేషనల్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఐపీ) కింద గుర్తించిన 7,000 ప్రాజెక్టులకు పెట్టుబడులు అందనున్నాయన్నారు.

ఇవీ చదవండి...

10వేల కంపెనీలు స్వచ్ఛంద మూసివేత!

టెల్కోల కొత్త నిబంధనలు..నిలిచిపోయిన ఓటీపీలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని