స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా లాభాల్లోనే - Stock market closing bell
close

Updated : 01/03/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా లాభాల్లోనే

ముంబయి: గతవారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకర సంకేతాలతో పాటు దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం, కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుండడం వంటి వార్తలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. ఉదయం 49,747 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 50,058 వద్ద గరిష్ఠాన్ని.. 49,440 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,772 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. రోజులో 14,806-14,638 మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్‌ 749 పాయింట్ల లాభంతో 49,849 వద్ద ముగియగా.. నిఫ్టీ 232 పాయింట్లు ఎగబాకి 14,761 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.50 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ టాప్‌ 30లో ఒక్క భారతీ ఎయిర్‌టెల్‌ మినహా మిగిలిన కంపెనీల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, యూపీఎల్ షేర్లు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం 4.22 శాతం నష్టాల్ని మూటగట్టుకుంది.

వరుసగా రెండు త్రైమాసికాల జీడీపీ వృద్ధిరేటు ప్రతికూలంగా నమోదు కావడంతో ఏర్పడిన సాంకేతిక మాంద్యం నుంచి భారత్‌ బయటపడిందంటూ శుక్రవారం వెలువడిన జాతీయ గణాంక కార్యాలయం నివేదిక మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఇక బాండ్ల ప్రతిఫలాల పెరుగుదల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు సోమవారం నాటికి కాస్త చల్లబడడంతో ఆసియా, ఐరోపా దేశాల సూచీలు సానుకూలంగా కదలాడాయి. అలాగే ఒకే డోసు టీకా అయిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సరఫరా ప్రారంభం కావడం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. మరోవైపు జపాన్‌లో పారిశ్రామికోత్పత్తి రెండేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం విశేషం. అలాగే అమెరికాలో కరోనా ఉద్దీపన పథకం ఆమోద ప్రక్రియలో పురోగతి కనిపించడం మార్కెట్లకు సానుకూలాంశం. ఇక దేశీయంగా ఫిబ్రవరిలో వాహన విక్రయాలు పుంజుకోవడం మదుపర్లను ఉత్సాహపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి.

ఇక ఉదయం కొద్దిసేపు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కాసేపు ట్రేడింగ్‌ ఆపేశారు. మదుపర్ల ఆర్డర్లకు ధ్రువీకరణలు ఉదయం కొద్దిసేపు ఆగిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రకటించింది. దీంతో మరోసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. దీనిపై స్పందించిన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ.. ట్రేడింగ్‌లో ఎలాంటి అవాంతరాలు లేవని.. కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నాయని వివరణ ఇచ్చింది. దీంతో మదుపర్లలో నెలకొన్న ఆందోళనలు తొలగిపోయాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని